హైదరాబాద్: తెలంగాణలో పారిశ్రామిక రంగాన్ని మరింత విస్తరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. తెలంగాణ రైజింగ్–2047 విజన్‌కు అనుగుణంగా కొత్త పారిశ్రామిక విధానాలకు రూపకల్పన చేస్తోంది. ప్రస్తుత పారిశ్రామిక విధానానికి దాదాపు పదేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో ‘ఇండస్ట్రియల్ పాలసీ 2.0’ను తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రాష్ట్రానికి భారీ పెట్టుబడులను ఆకర్షించడం, తయారీ రంగాన్ని బలోపేతం చేయడం, ఆధునిక సాంకేతికత ఆధారిత పరిశ్రమలను ప్రోత్సహించడం, పెద్ద సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు సృష్టించడం ఈ కొత్త విధానాల ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది. హైదరాబాద్‌కే పరిమితం కాకుండా జిల్లాలు, టైర్-2, టైర్-3 నగరాలకు పారిశ్రామిక కార్యకలాపాలను విస్తరించడంపైనా ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇండస్ట్రియల్ పాలసీ 2.0లో భాగంగా మొత్తం 10 కీలక రంగాలకు ప్రత్యేక విధానాలను రూపొందించే దిశగా ప్రభుత్వం ముందుకెళ్తోంది. ఇప్పటికే లైఫ్ సైన్సెస్ రంగానికి సంబంధించిన కొత్త విధానం ప్రకటించగా.. మిగిలిన రంగాలపై కసరత్తు కొనసాగుతోంది. లాజిస్టిక్స్, ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్, ఫుట్‌వేర్–లెదర్, అప్పెరల్–లైఫ్‌స్టైల్, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్, డేటా సెంటర్స్, ఆటోమొబైల్ రంగాలు ఇందులో ఉన్నాయి. కొత్త పారిశ్రామిక విధానాల్లో పెట్టుబడి విలువ ఒక్కటినే ప్రాతిపదికగా తీసుకోకుండా.. ఉద్యోగాల కల్పన, తయారీ సామర్థ్యం, ఎగుమతులు, స్థానికంగా ఏర్పడే విలువ, ప్రభుత్వానికి వచ్చే ఆదాయం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంది. పెద్ద, భారీ, మెగా పరిశ్రమలను రాష్ట్రానికి ఆకర్షించేలా ప్రత్యేక రాయితీలు, ప్రోత్సాహకాలను అందించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. జిల్లాల్లో పరిశ్రమలు ఏర్పాటు చేసే సంస్థలకు అదనపు ప్రయోజనాలు కల్పించే అంశంపైనా దృష్టి సారించింది. లైఫ్ సైన్సెస్ రంగంలో తెలంగాణను అంతర్జాతీయ స్థాయిలో మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ‘నెక్స్ట్ జెన్ లైఫ్ సైన్సెస్ పాలసీ 2026–30’ను ఇప్పటికే తీసుకొచ్చింది. 2030 నాటికి ప్రపంచంలోని అగ్రశ్రేణి లైఫ్ సైన్సెస్ క్లస్టర్లలో తెలంగాణను నిలపాలన్నది ప్రభుత్వ లక్ష్యం. వచ్చే ఐదేళ్లలో 25 బిలియన్ డాలర్ల పెట్టుబడులు, 5 లక్షల ఉద్యోగాల సృష్టిని లక్ష్యంగా పెట్టుకుంది. జీనోమ్ వ్యాలీ విస్తరణతో పాటు మెడికల్ డివైసెస్, గ్రీన్ ఫార్మా, ఫార్మా విలేజీలు, బయో ఇన్నోవేషన్ వంటి విభాగాలను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. హైదరాబాద్‌లో ఇప్పటికే బలంగా ఉన్న ఐటీ రంగాన్ని తదుపరి దశకు తీసుకెళ్లేందుకు ‘ఐటీ పాలసీ 2.0’ను రూపొందిస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, డీప్‌టెక్, ఫిన్‌టెక్, డిజిటల్ ఇంజినీరింగ్ వంటి రంగాలకు ఇందులో ప్రాధాన్యం ఇవ్వనున్నారు. భవిష్యత్‌లో అధిక విలువ కలిగిన టెక్నాలజీ ఆధారిత ఆర్థిక వ్యవస్థగా తెలంగాణను తీర్చిదిద్దేందుకు ఈ విధానం ఉపయోగపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ప్రపంచ కంపెనీలు చైనాకు ప్రత్యామ్నాయ తయారీ కేంద్రాల కోసం చూస్తున్న నేపథ్యంలో ఆ అవకాశాలను తెలంగాణ వైపు మళ్లించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. సెమీకండక్టర్లు, చిప్ డిజైన్, ఎలక