Kaizer News

రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించాలి..

రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించాలి..

· State - Telangana · prabhanews.com

మాజీ శాసనసభ్యులు శ్రీ బొల్లం మల్లయ్య యాదవ్ నడిగూడెం, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో పాలన చేతకాక, సంక్షేమ పథకాలను అమలు చేయడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ఆరోపించారు. నడిగూడెం మండలం కరివిరాల గ్రామంలోని విద్యుత్ సబ్‌స్టేషన్ వద్ద విద్యుత్ కోతలకు నిరసనగా రైతులతో కలిసి ఆయన ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లయ్య యాదవ్ మాట్లాడుతూ.. వ్యవసాయానికి సైతం కరెంట్ అందించలేని పరిస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని విమర్శించారు. అధికారులను నామమాత్రంగా చేసి, ప్రభుత్వ వైఫల్యాలను క్షేత్రస్థాయి ఉద్యోగులపైకి నెట్టే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. విద్యుత్ శాఖలో పనిచేస్తున్న అధికారులు రైతులకు సహాయం చేయాలని భావిస్తున్నప్పటికీ, ప్రభుత్వం నుంచి సరైన చర్యలు లేకపోవడంతో సమస్యలు పరిష్కారం కావడం లేదన్నారు. బోర్లు, బావుల కింద పంటలు సాగు చేస్తున్న రైతులు నాణ్యమైన విద్యుత్ లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, పంటలు కళ్ల ముందే ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు సమస్యలతో ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ప్రతిపక్షంగా రైతుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడుతామని తెలిపారు. వెంటనే ప్రభుత్వం స్పందించి రైతులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. సమస్య పరిష్కారం కాకపోతే అధికారుల కార్యాలయాల ముట్టడితో పాటు జాతీయ రహదారుల దిగ్బంధానికి సైతం వెనుకాడబోమని మల్లయ్య యాదవ్ హెచ్చరించారు. రైతులను ఆదుకోవడమే తమ ప్రధాన లక్ష్యమని, అవసరమైతే ప్రత్యక్ష ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు

Original source: prabhanews.com
Read more on Kaizer News