మంగళగిరి, ఆంధ్రప్రభ: ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే మున్సిపల్, పంచాయతీ స్థానిక సంస్థల ఎన్నికలకు జనసేన పార్టీ సమాయత్తమవుతోంది. ఇందులో భాగంగా ఎన్నికల ప్రచార కార్యక్రమాల నిర్వహణపై జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పార్టీ ముఖ్యులతో చర్చించారు. ఈ చర్చల అనంతరం స్థానిక సంస్థల ఎన్నికల ప్రచార కమిటీ సమన్వయకర్తగా రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్‌ను నియమిస్తూ జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రచార కమిటీలో ఎంఎస్‌ఎంఈడీసీ ఛైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావును సభ్యుడిగా నియమించగా, కమిటీలోని మిగిలిన సభ్యుల పేర్లను త్వరలోనే ప్రకటించనున్నారు. క్షేత్రస్థాయి వరకు ప్రచార నిర్వహణ, ప్రచార సామగ్రి సమకూర్చడం, ప్రచార ప్రక్రియను సమన్వయం చేయడం వంటి కీలక బాధ్యతలను ఈ కమిటీకి అప్పగించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి