Kaizer News

క్రీడలే విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాట

క్రీడలే విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాట

· Sports · prabhanews.com

ఊరుకొండపేటలో ఖో-ఖో ప్రత్యేక శిక్షణ ప్రారంభం ఊరుకొండ, ఆంధ్రప్రభ: నాగర్‌కర్నూలు జిల్లా జడ్చర్ల నియోజకవర్గం పరిధిలోని ఊరుకొండ మండలం ఊరుకొండపేట జడ్పీహెచ్‌ఎస్ మైదానంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఖో-ఖో ప్రత్యేక శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు జగన్ ఆధ్వర్యంలో, ప్రముఖ ఖో-ఖో కోచ్ బోల్గాం మల్లికార్జున్ నేతృత్వంలో ఆదివారం శిక్షణ నిర్వహించారు. రాబోయే రోజుల్లో జరగనున్న పాఠశాల క్రీడా సమాఖ్య అండర్-14, అండర్-16 జిల్లా, రాష్ట్రస్థాయి పోటీలను దృష్టిలో ఉంచుకుని ఈ శిక్షణను ప్రారంభించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఖో-ఖోలోని మెళకువలు, నియమ నిబంధనలు, దాడి-రక్షణ వ్యూహాలతో పాటు శారీరక దారుఢ్యంపై విద్యార్థులకు ప్రత్యేకంగా అవగాహన కల్పిస్తున్నారు. ఈ సందర్భంగా కోచ్ మల్లికార్జున్ మాట్లాడుతూ.. నేటి విద్యార్థులు సెల్‌ఫోన్లకు పరిమితమై శారీరక శ్రమకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చదువుతో పాటు క్రీడల్లోనూ రాణిస్తే శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు ఉన్నత విద్య, ఉద్యోగావకాశాల్లో ప్రయోజనాలు పొందే అవకాశం ఉంటుందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో అపారమైన ప్రతిభ దాగి ఉందని, సరైన శిక్షణ అందిస్తే విద్యార్థులు జాతీయస్థాయిలోనూ రాణించగలరని తెలిపారు. విద్యార్థులంతా క్రమం తప్పకుండా సాధన చేసి గ్రామానికి, మండలానికి మంచి పేరు తీసుకురావాలని పిలుపునిచ్చారు

Original source: prabhanews.com
Read more on Kaizer News