ఎస్ఐఆర్ ప్రక్రియను పరిశీలించిన ఓటరు నమోదు అధికారి నరసరావుపేట, ఆంధ్రప్రభ: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) కార్యక్రమంలో భాగంగా నరసరావుపేట అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో జరుగుతున్న ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను ఓటరు నమోదు అధికారి, రెవెన్యూ డివిజనల్ అధికారి కె. బాలకృష్ణ ఆదివారం పరిశీలించారు. నరసరావుపేట మండలం ఉప్పలపాడు గ్రామంలోని 261, పెట్లూరివారిపాలెం గ్రామంలోని 263, 264 పోలింగ్ కేంద్రాలను ఆయన సందర్శించి బూత్ స్థాయి అధికారుల పనితీరును సమీక్షించారు. ఓటరు జాబితాలో అర్హులైన ప్రతి ఒక్కరి పేరును నమోదు చేయాలని, అర్హత లేని పేర్లు, అభ్యంతరాలపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజల నుంచి అందే క్లెయిమ్స్, అభ్యంతరాలను సకాలంలో పరిష్కరించి ఎస్ఐఆర్ ప్రక్రియను సమర్థవంతంగా పూర్తి చేయాలని ఎన్నికల సిబ్బందికి ఆర్డీఓ సూచించారు. అర్హత కలిగిన ప్రతి ఓటరుకు ఓటు హక్కు కల్పించేలా బాధ్యతతో విధులు నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నరసరావుపేట తహసీల్దార్ మహమ్మద్ హుస్సేన్, ఎన్నికల సిబ్బంది, బీఎల్‌ఓలు పాల్గొన్నారు