జన్నారం రూరల్, ఆంధ్రప్రభ: కవ్వాల టైగర్ జోన్‌ను రద్దు చేసి, ఏకో సెన్సిటివ్ జోన్‌ను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ సామాజిక పోరాట సమితి ఆధ్వర్యంలో శ్రీరాముల భూమాచారి చేపట్టిన రిలే దీక్షలు ఆదివారం 8వ రోజుకు చేరుకున్నాయి. దీక్ష శిబిరాన్ని సీపీఐ(ఎం-ఎల్) లిబరేషన్ పార్టీ నాయకులు సందర్శించి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ సీపీఐ(ఎం-ఎల్) లిబరేషన్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.డి. ఖాజా మహమ్మద్ మాట్లాడుతూ, ఏకో సెన్సిటివ్ జోన్ పేరుతో అడవి వెలుపల ఉన్న వాగులు, గోదావరి పరివాహక ప్రాంతాల నుంచి ఇసుక తరలింపుపై అటవీ అధికారులు ఆంక్షలు విధిస్తున్నారని ఆరోపించారు. గ్రామాల అభివృద్ధి పనులు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఇసుకను ట్రాక్టర్లలో తరలిస్తే వాహనాలను పట్టుకుని వేల రూపాయల జరిమానాలు విధిస్తున్నారని అన్నారు. ప్రజల జీవనోపాధికి ఇబ్బందులు కలగకుండా సంబంధిత నిబంధనలను సరళీకరించాలని ఖాజా మహమ్మద్ డిమాండ్ చేశారు. కవ్వాల టైగర్ జోన్‌పై అసెంబ్లీలో తీర్మానం చేసి సమస్యకు పరిష్కారం చూపాలని కోరారు. కార్యక్రమంలో రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షుడు శనిగరపు వెంకటేష్, మండల అధ్యక్షుడు కోరుట్ల శంకరయ్య, జిల్లా విద్యార్థి సంఘం అధ్యక్షుడు బొమ్మిడి అభినయ్, ప్రధాన కార్యదర్శి శనిగరపు రామ్ చరణ్, పార్టీ నాయకులు బొమ్మిడి శ్రీను, రవి, సుల్వ రాజు తదితరులు పాల్గొన్నారు