టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య మరోసారి వార్తల్లో నిలిచాడు. ఈసారి మైదానంలో తన ఆటతో కాదు.. తన ఖరీదైన కారు కారణంగా సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాడు. బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో ప్రాక్టీస్ ముగించుకున్న హార్దిక్.. తన కొత్త ఫెరారీ 12సిలిండ్రీతో వెళ్లిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. వైరల్ వీడియోలో ప్రాక్టీస్ సెషన్ ముగించుకున్న హార్దిక్ పాండ్యా.. ట్రైనింగ్ దుస్తులు, స్లైడ్స్‌తో బయటకు వస్తూ కనిపించాడు. అనంతరం అక్కడ పార్క్ చేసి ఉన్న తన స్కై బ్లూ రంగు ఫెరారీ 12సిలిండ్రీని చూసి కాసేపు ఆగాడు. వెంటనే ఫోన్ తీసి తన కారును ఫొటో తీశాడు. ఆ తర్వాత కారు వద్దకు వెళ్లి ఇంటికి బయలుదేరాడు. తన సొంత కారును హార్దిక్ ఇలా ఫొటో తీసుకోవడం అభిమానుల దృష్టిని ఆకర్షించింది. క్రికెట్‌లో అగ్రస్థాయికి చేరుకున్నప్పటికీ.. తాను ఎంతో ఇష్టపడే కారును చూసి సాధారణ కార్ల అభిమాని మాదిరిగానే హార్దిక్ మురిసిపోయాడంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. హార్దిక్ పాండ్య గ్యారేజీలో చేరిన ఫెరారీ 12సిలిండ్రీ విలువ సుమారు రూ.12 కోట్లు ఉంటుందని కథనాలు పేర్కొంటున్నాయి. ఈ లగ్జరీ కారు సహజసిద్ధంగా పనిచేసే 6.5 లీటర్ల V12 ఇంజిన్తో వస్తుంది. క్లాసిక్ గ్రాండ్ టూరర్ డిజైన్‌కు ఆధునిక ఏరోడైనమిక్ టెక్నాలజీని జోడించారు. 2026 మార్చిలోనూ హార్దిక్ ఈ ఫెరారీని నడుపుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఫెరారీ 12సిలిండ్రీలో 6.5 లీటర్ల V12 ఇంజిన్, సుమారు 819-830 బీహెచ్‌పీ శక్తి వంటి ప్రత్యేకతలు ఉన్నట్లు ఇతర ఆటోమొబైల్, క్రీడా కథనాలు పేర్కొన్నాయి. మైదానంలో పవర్‌ఫుల్ హిట్టింగ్‌తో అభిమానులను అలరించే హార్దిక్.. ఇప్పుడు తన లగ్జరీ కారుతోనూ అదే స్థాయిలో ఫ్యాన్స్ దృష్టిని ఆకర్షిస్తున్నాడు. బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ వద్ద చోటుచేసుకున్న ఈ చిన్న వీడియో సోషల్ మీడియాలో మాత్రం పెద్ద చర్చకు దారితీసింది. మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి