పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ విజయవాడ, ఆంధ్రప్రభ: ఈ నెల 30వ తేదీ ఆదివారం జరగనున్న నీట్ పీజీ–2026 పరీక్షను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ తెలిపారు. పరీక్ష నిర్వహణలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు. విజయవాడలోని పీఎస్‌సీఎంఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ, ఎనికేపాడులోని శ్రీ విజయదుర్గ ఐటీ ఇన్ఫో సొల్యూషన్స్‌లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ రెండు కేంద్రాల్లో మొత్తం 843 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. ఈ నేపథ్యంలో శనివారం కలెక్టర్ డా. లక్ష్మీశ పీఎస్‌సీఎంఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ పరీక్షా కేంద్రాన్ని సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. అభ్యర్థులకు అవసరమైన సౌకర్యాలతో పాటు పరీక్షా కేంద్రంలో భద్రతా ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద వైద్య శిబిరాలు, తాగునీరు, విద్యుత్, పారిశుద్ధ్యం తదితర సౌకర్యాలు సక్రమంగా ఉండేలా చూడాలని ఆదేశించారు. పరీక్షకు వచ్చే అభ్యర్థులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు కంప్యూటర్ ఆధారిత విధానంలో పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్షను నిబంధనలకు అనుగుణంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ డా. లక్ష్మీశ ఆదేశించారు