సెప్టెంబర్ 4న జన్మాష్టమి వేడుకలు.. 5న శ్రీల ప్రభుపాద వ్యాసపూజ మహోత్సవం కర్నూలు, ఆంధ్రప్రభ: శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలకు కర్నూలులో ఇస్కాన్ సంస్థ ఘనంగా సన్నాహాలు చేస్తోంది. సెప్టెంబర్ 4న శ్రీకృష్ణ జన్మాష్టమి, సెప్టెంబర్ 5న ఇస్కాన్ వ్యవస్థాపకాచార్యులు శ్రీల ప్రభుపాద 130వ వ్యాసపూజ మహోత్సవాన్ని నిర్వహించనున్నారు. రెండు రోజుల పాటు హరినామ సంకీర్తనలు, ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఆధ్యాత్మిక ప్రవచనాలు, సాంస్కృతిక కార్యక్రమాలతో భక్తులకు ఆధ్యాత్మిక వాతావరణాన్ని అందించనున్నారు. నగరంలోని కప్పల నగర్‌లోని సోమిశెట్టి తనీష్ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్‌లో సెప్టెంబర్ 4న జన్మాష్టమి వేడుకలు జరుగనున్నాయి. తెల్లవారుజామున 4.30 గంటలకు మంగళహారతితో కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. ఉదయం 7.30 గంటలకు దర్శన హారతి నిర్వహిస్తారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ప్రత్యేక హరినామ సంకీర్తనలు, సాంస్కృతిక కార్యక్రమాలు కొనసాగనున్నాయి. సాయంత్రం 4.30 గంటల నుంచి మరోసారి హరినామ సంకీర్తనతో పాటు ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. రాత్రి 9 గంటలకు మహాశంఖాభిషేకం ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. అనంతరం 1008 రకాల ఆహార పదార్థాలతో శ్రీకృష్ణుడికి ప్రత్యేక నివేదనలు సమర్పిస్తారు. ప్రవచనం, హారతి అనంతరం భక్తులకు ప్రసాద వితరణ ఉంటుందని ఇస్కాన్ ఆలయ అధ్యక్షుడు వైష్ణవ కృపాదాస్ తెలిపారు. సెప్టెంబర్ 5న శ్రీల ప్రభుపాద 130వ అవతరణ దినోత్సవం, వ్యాసపూజ మహోత్సవాన్ని నిర్వహించనున్నారు. ఉదయం 8 గంటలకు దర్శన హారతి, అనంతరం ఉదయం 11 గంటలకు మహాశంఖాభిషేకం నిర్వహిస్తారు. ప్రత్యేక ప్రవచనాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా ఉంటాయని నిర్వాహకులు వెల్లడించారు. శ్రీకృష్ణ జన్మాష్టమి, శ్రీల ప్రభుపాద వ్యాసపూజ మహోత్సవాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఇస్కాన్ నిర్వాహకులు కోరారు