Visakhapatnam: విజయనగరం జిల్లాలో సీఐగా పనిచేస్తున్న ఎస్. విద్యాసాగర్ కుమారుడు రణసూర్య ఆస్ట్రేలియాలో జైళ్ల శాఖ అధికారిగా పనిచేస్తున్నారు. తనతో పాటు పనిచేస్తున్న స్నేహితుడు బ్రాడీని రణసూర్య పెళ్లికి ఆహ్వానించారు. బ్రాడీ తనకు కాబోయే శ్రీమతి ఇమలి, కుటుంబ సభ్యులతో కలిసి గురువారం రాత్రి విశాఖపట్నం షీలానగర్లోని నమస్వీ కన్వెన్షన్ హాలులో జరిగిన రణసూర్య వివాహానికి హాజరయ్యాడు. హిందూ సంప్రదాయ పద్ధతికి ఆకర్షితులైన బ్రాడీ, ఇమలి అదే కల్యాణ వేదికపై పెళ్లి చేసుకున్నారు. వేద పండితుల మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల మధ్య ఒక్కటైన ఆస్ట్రేలియా జంటను అతిథులు మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు. పవిత్రమైన హిందూ సంస్కృతీ, సంప్రదాయాలంటే తమకు ఎంతో గౌరవమని, స్నేహితుడి వివాహానికి హాజరైన సందర్భంగా ఇక్కడి పద్ధతులకు ఆకర్షితులమై తాము కూడా వివాహం చేసుకున్నామని బ్రాడీ, ఇమలి జంట తెలిపారు