విశాఖపట్నం: ప్రజాప్రభుత్వ పాలనలో విశాఖపట్నం అంతర్జాతీయ నగరంగా వేగంగా అభివృద్ధి చెందుతోంది. పారిశ్రామిక, ఐటీ, విద్యా రంగాలతో పాటు వైద్య రంగంలోనూ నగరానికి ప్రపంచస్థాయి సంస్థలను తీసుకురావడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఆసియాలోనే ప్రముఖ వైద్య సంస్థగా పేరొందిన ఏఐజీ హాస్పిటల్స్ విశాఖలో భారీ ఆసుపత్రి క్యాంపస్‌ను ఏర్పాటు చేయనుంది. విశాఖలోని ఎండాడ ప్రాంతంలో నిర్మించనున్న ఏఐజీ హాస్పిటల్స్‌కు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ సోమవారం శంకుస్థాపన చేయనున్నారు. ఈ ఆసుపత్రి అందుబాటులోకి వస్తే రాష్ట్ర ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలు మరింత చేరువ కానున్నాయి. హైదరాబాద్‌కు వెళ్లాల్సిన అవసరం తగ్గేలా అత్యాధునిక వైద్యం ప్రస్తుతం అత్యున్నత స్థాయి వైద్య సేవల కోసం ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అనేక మంది రోగులు హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. విశాఖలో ఏఐజీ హాస్పిటల్స్ ఏర్పాటు కావడం ద్వారా ఈ పరిస్థితిలో గణనీయమైన మార్పు వచ్చే అవకాశం ఉంది. అత్యాధునిక వైద్య సదుపాయాలు, నిపుణులైన వైద్యులు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, పరిశోధనా కేంద్రాలు ఒకే చోట అందుబాటులోకి రానున్నాయి. దీంతో సంక్లిష్టమైన వ్యాధులకు కూడా రాష్ట్రంలోనే మెరుగైన చికిత్స పొందే అవకాశం ప్రజలకు లభించనుంది. విశాఖలో ఏఐజీ హాస్పిటల్స్ ఏర్పాటు కోసం సంస్థ దశలవారీగా భారీగా పెట్టుబడులు పెట్టనుంది. రానున్న ఐదేళ్లలో సుమారు రూ.2 వేల కోట్ల పెట్టుబడి పెట్టాలని సంస్థ నిర్ణయించింది. ఈ పెట్టుబడితో ఆసుపత్రి నిర్మాణంతో పాటు వైద్య, పరిశోధన, శిక్షణ, అనుబంధ ఆరోగ్య సేవలకు సంబంధించిన మౌలిక వసతులను అభివృద్ధి చేయనున్నారు. భారీ పెట్టుబడి రావడంతో విశాఖలో వైద్య రంగానికి మరింత ఊతం లభించడంతో పాటు నగర ఆర్థిక వ్యవస్థకు కూడా ప్రయోజనం చేకూరనుంది. ఏఐజీ హాస్పిటల్స్ ఏర్పాటుతో వైద్య రంగంలోనే కాకుండా అనుబంధ రంగాల్లోనూ భారీగా ఉద్యోగ అవకాశాలు ఏర్పడనున్నాయి. మొత్తం ప్రాజెక్టు ద్వారా సుమారు 9 వేల మందికి ఉపాధి లభించనుందని అంచనా. వైద్యులు, నర్సులు, టెక్నీషియన్లు, పారామెడికల్ సిబ్బంది, పరిపాలనా సిబ్బందితో పాటు ఆసుపత్రికి అనుబంధంగా పనిచేసే వివిధ సేవా విభాగాల్లో ఉద్యోగాలు అందుబాటులోకి రానున్నాయి. స్థానిక యువతకు కూడా ఈ ప్రాజెక్టు కొత్త అవకాశాలను కల్పించనుంది. పూర్తిస్థాయి నిర్మాణం పూర్తయ్యే నాటికి విశాఖ ఏఐజీ ఆసుపత్రి సామర్థ్యం వెయ్యి పడకలకు చేరనుంది. రోజుకు సుమారు 5 వేల మంది రోగులకు ఓపీ సేవలు అందించేలా ఆసుపత్రిని రూపొందిస్తున్నారు. భారీ సంఖ్యలో రోగులకు వైద్య సేవలు అందించేందుకు అనుగుణంగా ఆధునిక మౌలిక వసతులు ఏర్పాటు చేయనున్నారు. అత్యవసర వైద్యం, శస్త్రచికిత్సలు, ఐసీయూ, డయాగ్నస్టిక్ సేవలు, ప్రత్యేక వైద్య విభాగాలను సమగ్రంగా అందుబాటులోకి తీసుకురానున్నారు. 9 ఎకరాల్లో ఆసుపత్రి.. 2.5 ఎకరాల్లో నర్సింగ్ కళాశాల ఏఐజీ హాస్పిటల్స్ విశాఖలో 9 ఎకరాల విస్తీర్ణంలో ప్రధాన ఆసుపత్రి క్యాంపస్‌ను ఏర్పాటు చేయనుంది. దీనికి అనుబంధంగా 2.5 ఎకరాల్లో ప్రత్యేక నర్సింగ్ కళాశాలను నిర్మించనున్నారు. ఆసుపత్రి, నర్సింగ్ విద్య, వైద్య శిక్షణ, పరిశోధనలను ఒకే సమగ్ర వ్యవస్థలోకి తీ