Shorts కరీంనగర్: కరీంనగర్ పట్టణంలోని సిక్కు వాడికి చెందిన కాంగ్రెస్ నాయకులు అమన్ జిత్ సింగ్ ను జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ చొప్పదండి ఎమ్మెల్యే, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డాక్టర్ మేడిపల్లి సత్యం నగరంలోని రేకుర్తి క్యాంపు కార్యాలయంలో నియామక ఉత్తర్వులు అందజేశారు. ఈ సందర్భంగా మేడిపల్లి సత్యం మాట్లాడుతూ - కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ సామాజిక న్యాయానికి, అన్ని మతాలకు, అన్ని వర్గాలకు సముచిత ప్రాధాన్యత ఇస్తుందని, అందులో భాగంగానే సిక్కు మైనార్టీకి చెందిన అమన్ జిత్ సింగ్ కు ప్రధాన కార్యదర్శి బాధ్యతలు అప్పగించడం జరిగిందన్నారు. జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి, సిక్కు మైనార్టీల హక్కులపై పోరాటం, వారి సమస్యల పరిష్కారం కోసం అమన్ జిత్ సింగ్ వారధిగా పని చేస్తారని ఆకాంక్షించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను సిక్కు మైనార్టీ ప్రజలతో పాటు అన్ని వర్గాలకు విస్తృతంగా తీసుకెళ్లాలని ఆదేశించారు. తన నియామకం పట్ల అమన్ జిత్ సింగ్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన DCC అధ్యక్షులు మేడిపల్లి సత్యంకి, జిల్లా మంత్రులకు, జిల్లా కాంగ్రెస్ ముఖ్య నేతలకు, సీనియర్ నాయకులకు మరియు కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పురుమల్ల శ్రీనివాస్ కి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ ఆదేశాల మేరకు జిల్లాలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేస్తూ, మైనార్టీల సంక్షేమానికి కృషి చేస్తానని తెలిపారు. అమన్ జిత్ సింగ్ నియామకం పట్ల కరీంనగర్ సిక్కు సమాజం, మైనార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు