Kaizer News

సీఎం రేవంత్‎కు బంగారు రాఖీ కట్టిన మంత్రి సురేఖ

సీఎం రేవంత్‎కు బంగారు రాఖీ కట్టిన మంత్రి సురేఖ

· State - Telangana · v6velugu.com

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ఆడపడుచులందరి దీవెనలు సీఎం రేవంత్‌రెడ్డికి ఉండాలని, ఆయన ఆశీస్సులు కూడా మహిళలకు ఉండాలని మంత్రి కొండా సురేఖ ఆకాంక్షించారు. శుక్రవారం రాఖీ పౌర్ణమి సందర్భంగా జూబ్లీహిల్స్ లోని సీఎం నివాసానికి వెళ్లిన సురేఖ.. రేవంత్ రెడ్డితోపాటు ఆయన అల్లుడు, మనువడికి రాఖీ కట్టి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డికి బంగారు రాఖీ కట్టారు. ఆ సమయంలో రేవంత్‌తోపాటు ఆయన కుటుంబ సభ్యులు, మంత్రి సీతక్క ఉన్నారు. రేవంత్‌కు వ్యతిరేకంగా తన కూతురు కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యల అనంతరం మొదటిసారి మంత్రి సురేఖ సీఎంను కలవడం రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. రాఖీ కట్టిన అనంతరం సురేఖ నేరుగా ఆమె ఇంటికి వెళ్లి మీడియాతో మాట్లాడారు. ప్రతి ఏడాది సీఎం రేవంత్‌రెడ్డికి రాఖీ కడుతున్నట్టే ఈ ఏడాది కూడా కట్టానని, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆయనకు రాఖీ కట్టడం ఇది మూడోసారి అని చెప్పారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే శక్తి, యుక్తి రేవంత్‌కు కలగాలని ఆకాంక్షించారు. తెలంగాణలోని ప్రతి కుటుంబం తనను తమ ఇంటి ఆడపడుచులా ఆదరిస్తుందని సురేఖ చెప్పారు

Original source: v6velugu.com
Read more on Kaizer News