Asian Games : జపాన్ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో పసిడి పతకంపై ఆశలు రేపిన క్వింసీ డిసౌజా (Quimcy Dsouza) నిరాశపరిచింది. ఆరంభ వేడుకల రోజే తను ‘తెక్‌బాల్’ (Teqball) సెమీస్‌లో అనూహ్యంగా ఓటమి పాలైంది. మహిళల సింగిల్స్‌లో సుమయా(ఇండోనేషియా) చేతిలో పరాజయం చవిచూసిన డిసౌజా ఆదివారం కాంస్యం కోసం పోరాడనుంది. మిక్స్‌డ్ డబుల్స్‌లో భారత్‌కే చెందిన మొహమ్మద్ అనస్ ఇమ్రాన్ బేగ్‌తో కలిసి మూడో స్థానంలో నిలిచేందుకు తను సిద్ధమవుతోంది. అరంగేట్రం ఆసియా క్రీడల్లో గ్రూప్ దశలోనే అత్యధిక పాయింట్లతో చరిత్ర సృష్టించిన క్వింసీ డిసౌజా తెక్‌బాల్ సెమీఫైనల్ దాటలేకపోయింది. వరస సెట్లలో తేలిపోవడంతో తను ఇక కాంస్యంపైనే ఆశలు పెట్టుకుంది. శనివారం సుమయా (ఇండోనేషియా)తో జరిగిన మ్యాచ్ ఆరంభంలో దూకుడు కనబరిచిన 24 ఏళ్ల డిసౌజా తొలి సెట్‌ను 12-7తో గెలుచుకుంది. కానీ, రెండో సెట్‌లో భారత అథ్లెట్ జోరుకు సుమయ అడ్డుకట్ట వేస్తూ.. 12-9తో విజయం సాధించి స్కోర్ సమం చేసింది. నిర్ణయాత్మక మూడో సెట్‌లో డిసౌజా పుంజుకున్నా సరిపోలేదు. చివరకు 12-7తో భారత అథ్లెట్‌ను ఓడించి ఫైనల్‌కు దూసుకెళ్లింది సుమయా. ఫైనల్ బెర్తు చేజారినా నగోయలో పోడియం మీద నిల్చునేందుకు డిసౌజాకు ఇంకా అవకాశముంది. కాంస్య పతక పోరులో భాగంగా.. మూడో స్థానం కోసం కంబోడియాకు చెందిన క్రీడాకారిణి కొయెంయీన్ డీని డిసౌజా ఎదుర్కోనుంది. గ్రూప్ దశలో కొయెంయూన్‌ను చిత్తు చేసి నేరుగా సెమీస్ చేరిన భారత అథ్లెట్.. ఈసారి కూడా అదిరే ఆటతో ప్రత్యర్థికి చెక్ పెట్టాలనుకుంటోంది. సెప్టెంబర్ 20 ఆదివారం ఉదయం 10 గంటలకు వీరి మ్యాచ్ జరుగనుంది