Kaizer News

సహకార సంఘం ఎన్నికలు నిర్వహించండి

సహకార సంఘం ఎన్నికలు నిర్వహించండి

· State - Telangana · ntnews.com

ఆ శాఖ కమిషనర్‌కు పీఏసీఎస్‌ ఫోరం నేతల వినతి హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 19 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల(పీఏసీఎస్‌)కు వెంటనే ఎన్నికలు నిర్వహించాలని, ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేవరకు ప్రస్తుత పాలకవర్గాలనే కొనసాగించాలని పీఏసీఎస్‌ రాష్ట్ర ఫోరం శనివారం ప్రభుత్వానికి విజ్ఞప్తిచేసింది. ఈ మేరకు సహకార శాఖ ప్రత్యేక కమిషనర్‌ రాహుల్‌రాజ్‌కు ఫోరం ప్రతినిధులు లేఖ ద్వారా విన్నవించారు. తెలంగాణ సహకార సంఘాల చట్టం-1964 నిబంధనల మేరకు ప్రతి ఐదేండ్లకు సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నదని లేఖలో గుర్తుచేశారు. రాష్ట్రవ్యాప్తంగా 908 పీఏసీఎస్‌ సంఘాలు ఉండగా, వీటికి 2020 ఫిబ్రవరిలో ఎన్నికలు జరిగాయని, వాటి పదవీకాలం ముగిసి సంవత్సరం దాటినా ఇప్పటికీ ఎన్నికలు జరిపేందుకు ఎన్నికల ప్రాధికార సంస్థకు ప్రతిపాదనలు పంపకపోవడం దారుణమని పేర్కొన్నారు. అయితే, ఎలాంటి కారణాలు లేకుండా చట్టవిరుద్ధంగా పాలకవర్గాలను రద్దు చేస్తూ అధికారులు జీవో-597 జారీ చేయడంపై హైకోర్టును ఆశ్రయించినట్టు ఫోరం నేతలు గుర్తుచేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం సదరు జీవోపై స్టే విధించి, జీవో-386ను పునరుద్ధరిస్తూ ఉత్తర్వులు ఇచ్చిందని తెలిపారు. దీంతో 2026 మే 4న 908 సొసైటీల పాలకవర్గాలు తిరిగి బాధ్యతలు స్వీకరించినప్పటికీ, అధికారులు ఇప్పటికీ ఎన్నికలు నిర్వహించడంలో తాత్సారం చేస్తున్నారని అసంతృప్తి వ్యక్తంచేశారు. సకాలంలో ఎన్నికలు నిర్వహించకపోవడం, పాలకవర్గాలకు అధికారాలు లేకపోవడంతో నాబార్డ్‌ సహా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలు, రాయితీలు రైతులకు అందడం లేదని ఆందోళన వ్యక్తంచేశారు. ఇప్పటికైనా ఎన్నికలు నిర్వహించి సొసైటీలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉన్నదని సూచించారు

Original source: ntnews.com
Read more on Kaizer News