గద్వాల రైల్వే స్టేషన్ ఏర్పడి వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా గద్వాల రైల్వేస్టేషన్ పనులు పూర్తి చేసి శతాబ్ది ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించుకుందామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రూ.43 కోట్లతో చేపట్టిన గద్వాల రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులను మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డితో కలిసి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పరిశీలించారు. పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేలా నాణ్యతా ప్రమాణాలతో నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని సూచించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. గద్వాల రైల్వే స్టేషన్ ఆధునికీకరణతో పాటు తెలంగాణలో 42 రైల్వే స్టేషషన్‌లు ఏకకాలంలో అభివృద్ధి చేస్తున్నట్టు చెప్పారు. రూ.43 కోట్లతో గద్వాల రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు చేపట్టినట్టు వివరించారు. ప్రయాణికుల సౌకర్యార్థం ఎస్కలేటర్, రెండు లిఫ్టులు, క్యాంటీన్, దివ్యాంగులకు ఆధునిక వసతులు కల్పించడం జరుగుతుందన్నారు. ఈ ఏడాది చివరి నాటికి రైల్వేస్టేషన్ అభివృద్ధి పనులు పూర్తి చేయడం జరుగుతుందన్నారు. గద్వాల ప్రాంత అభివృద్ధికి రైల్వే కనెక్టివిటీ ఎంతో కీలకమని, ఆధునికీకరణ పనులు పూర్తయిన తర్వాత ప్రయాణికులకు మరింత సౌకర్యవంతమైన సేవలు అందుతాయని పేర్కొన్నారు