Kaizer News

మొగుళ్లపల్లి జెడ్పీహెచ్‌ఎస్‌లో ఘనంగా జాతీయ క్రీడా

మొగుళ్లపల్లి జెడ్పీహెచ్‌ఎస్‌లో ఘనంగా జాతీయ క్రీడా దినోత్సవం

· Sports · prabhanews.com

క్రీడలతో క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు అభివృద్ధి మొగుళ్లపల్లి, ఆంధ్రప్రభ : జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని మొగుళ్లపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో శనివారం క్రీడా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇన్‌చార్జి ప్రధానోపాధ్యాయులు ఎం. రాజు, పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ జి. రాజయ్య ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పీడీ జి. రాజయ్య మాట్లాడుతూ భారతదేశంలో కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, క్రికెట్, హాకీ తదితర క్రీడలకు ఎంతో ఆదరణ ఉందన్నారు. క్రికెట్‌ అనగానే సచిన్‌ టెండూల్కర్‌, పరుగుపందెం అనగానే పీటీ ఉష, హాకీ అనగానే మేజర్‌ ధ్యాన్‌చంద్‌ గుర్తుకొస్తారని పేర్కొన్నారు. హాకీకి ధ్యాన్‌చంద్‌, ధ్యాన్‌చంద్‌కు హాకీ అన్నంతగా ఆయన క్రీడా రంగంలో ప్రత్యేక గుర్తింపు పొందారని తెలిపారు. మేజర్‌ ధ్యాన్‌చంద్‌ జయంతిని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం ఆగస్టు 29న జాతీయ క్రీడా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. క్రీడల ద్వారా క్రమశిక్షణ, జట్టు భావన, నాయకత్వం, గౌరవం, పట్టుదల, ధైర్యం, ఆత్మవిశ్వాసం, న్యాయమైన పోటీ, క్రీడా స్ఫూర్తి వంటి లక్షణాలు పెంపొందుతాయని అన్నారు. విద్యార్థులు ధ్యాన్‌చంద్‌ను ఆదర్శంగా తీసుకుని క్రీడల్లో రాణించి తల్లిదండ్రులు, పాఠశాల, రాష్ట్రం, దేశానికి పేరు తీసుకురావాలని సూచించారు. ఈ సందర్భంగా పాఠశాలలో వివిధ క్రీడా పోటీలు నిర్వహించి విజేతలైన విద్యార్థినీ, విద్యార్థులకు బహుమతులు అందజేశారు. అనంతరం విద్యార్థులతో క్రీడా ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జి ప్రధానోపాధ్యాయులు ఎం. రాజు, ఉపాధ్యాయులు బి. కుమారస్వామి, కె. ప్రవీణ్‌, పి. లలిత, విజయభాస్కర్‌, అటెండర్‌ ఎం.డి. మజహార్‌, ఎన్‌సీసీ విద్యార్థులు, విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు

Original source: prabhanews.com
Read more on Kaizer News