ఒక దట్టమైన అడవిలో పెద్ద మర్రిచెట్టు ఉండేది. ఆ చెట్టు చుట్టూ ఎన్నో రకాల పక్షులు, జంతువులు నివసించేవి. ఆ మర్రిచెట్టులోని ఒక బలమైన కొమ్మపై రెండు పిచ్చుకలు ఎంతో ప్రేమగా ఒక అందమైన గూడు కట్టుకుని జీవించేవి. ఆడ పిచ్చుక త్వరలో తల్లి కాబోతుండటంతో ఎంతో సంతోషంగా ఉండేది. కొద్దిరోజులకు అది కొన్ని గుడ్లు పెట్టింది. ఆ గుడ్లను ఎంతో జాగ్రత్తగా చూసుకుంటూ గూటి దగ్గరే ఉండేది. మగ పిచ్చుక మాత్రం ప్రతిరోజూ ఆహారం కోసం అడవిలోకి వెళ్లి, సాయంత్రానికి తిరిగి వచ్చేది. ‘మన పిల్లలు గుడ్ల నుంచి బయటకు వచ్చిన తర్వాత వాళ్లతో కలిసి ఎంతో ఆనందంగా జీవించాలి’ అని ఆ రెండు పిచ్చుకలు ఎన్నో కలలు కనేవి. అదే అడవిలో ఒక పెద్ద ఏనుగు ఉండేది. దానికి తన బలం మీద చాలా గర్వం. కొన్నిసార్లు కోపం వచ్చినప్పుడు చెట్ల కొమ్మలను విరగ్గొట్టడం, చిన్న జంతువులను భయపెట్టడం చేసేది. ఒక మండుటెండల మధ్యాహ్నం ఆ ఏనుగుకు చాలా వేడిగా అనిపించింది. నీడ కోసం అది ఆ మర్రిచెట్టు కిందకు వచ్చింది. అక్కడ చల్లని నీడలో కొద్దిసేపు నిలబడ్డ ఏనుగుకు ఏదో కారణంతో కోపం వచ్చింది. తన తొండంతో మర్రిచెట్టులోని ఒక కొమ్మను పట్టుకుని బలంగా లాగింది. ఫెళ్… ఫెళ్… అంటూ ఆ కొమ్మ విరిగిపోయింది. ఆ కొమ్మపైనే పిచ్చుక గూడు ఉంది. కొమ్మ విరగడంతో గూడు గాలిలో ఎగిరి కిందపడిపోయింది. గూటిలో ఉన్న గుడ్లన్నీ నేలపై పడి పగిలిపోయాయి. ‘అయ్యో! నా గుడ్లు… నా పిల్లలు!’ అంటూ ఆడ పిచ్చుక గుండెలు పగిలేలా ఏడ్చింది. ఏనుగు మాత్రం తనకు జరిగిన విషయం ఏమీ పట్టనట్టుగా అక్కడి నుంచి వెళ్లిపోయింది. కొంతసేపటికి ఆహారం తీసుకుని మగ పిచ్చుక తిరిగి వచ్చింది. గూడు కనిపించకపోవడంతో ఆశ్చర్యపోయింది. ‘ఏమైంది? మన గూడు ఎక్కడుంది?’ అని అడిగింది. ఆడ పిచ్చుక కన్నీళ్లతో జరిగినదంతా చెప్పింది. ‘ఆ ఏనుగు మన గూడును ధ్వంసం చేసింది. మన పిల్లలుగా మారాల్సిన గుడ్లన్నీ పగిలిపోయాయి’ అంటూ బోరున విలపించింది. మగ పిచ్చుక కూడా ఎంతో బాధపడింది. ‘మనకు జరిగిన నష్టం తిరిగి రాదు. కానీ ఆ ఏనుగు ఇంకెవరికి ఇలాంటి అన్యాయం చేయకుండా దానికి గుణపాఠం చెప్పాలి’ అని ఆడ పిచ్చుక అంది. గ పిచ్చుక మాత్రం ‘అది చాలా పెద్దది, చాలా బలమైనది. మనలాంటి చిన్న పక్షులు దానితో ఎలా పోరాడగలం?’ అని ఆలోచించింది. అంతలో పిచ్చుకకు స్నేహితుడైన కొంగ అక్కడికి వచ్చింది. పిచ్చుక ఏడుస్తున్నది చూసి ‘మిత్రమా! ఎందుకు ఇంత బాధపడుతున్నావు?’ అని అడిగింది. పిచ్చుక జరిగినదంతా చెప్పింది. ‘నాకు జరిగిన అన్యాయానికి న్యాయం కావాలి. ఆ ఏనుగుకు బుద్ధి చెప్పడానికి నువ్వు నాకు సహాయం చేయాలి’ అని కోరింది. కొంగ కాసేపు ఆలోచించి ‘ఏనుగు మనకంటే ఎన్నో రెట్లు బలమైనది. దానితో నేరుగా పోరాడటం మంచిది కాదు. కానీ బలాన్ని ఎదుర్కోవడానికి ఎప్పుడూ బలం అవసరం లేదు. తెలివి, ఐకమత్యం ఉంటే బలవంతుడిని కూడా ఓడించవచ్చు’ అని చెప్పింది. కొంగకు ఒక ఈగతో స్నేహం ఉంది. వెంటనే ఈగను పిలిచారు. పిచ్చుకకు జరిగిన అన్యాయం విన్న ఈగ కూడా సహాయం చేయడానికి సిద్ధమైంది. ‘నాకు కప్పతో మంచి స్నేహం ఉంది. మనం దాని సలహా కూడా తీసుకుందాం’ అని ఈగ చెప్పింది. అందరూ కలిసి కప్ప దగ్గరకు వెళ్లి జరిగిన విషయాన్ని వివరించారు. కప్ప ప్రశాంతంగా మొత్తం విషయం విన్నది.