Kaizer News

కేజీబీవీ గేటు ముందే మద్యం విక్రయాలా?

కేజీబీవీ గేటు ముందే మద్యం విక్రయాలా?

· State - Telangana · prabhanews.com

విద్యార్థినుల హాస్టల్‌కు అడుగుల దూరంలో బెల్ట్‌షాప్‌ నిర్వహణపై ఆరోపణలు రోజంతా కొనుగోలుదారుల రాకపోకలు.. అధికారుల తీరుపై గ్రామస్థుల ఆగ్రహం కన్నాయిగూడెం, ఆంధ్రప్రభ: కన్నాయిగూడెం మండలం ముప్పనపల్లి గ్రామంలో విద్యార్థినుల భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది. గ్రామంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం హాస్టల్‌, ఉన్నత పాఠశాల ప్రధాన గేటుకు అత్యంత సమీపంలోనే అక్రమంగా మద్యం విక్రయాలు సాగుతున్నాయనే ఆరోపణలు స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి. కేజీబీవీ హాస్టల్‌లో వందలాది మంది బాలికలు నివాసం ఉంటూ విద్యను అభ్యసిస్తుండగా, ప్రధాన గేటుకు కొన్ని మీటర్ల దూరంలోనే బెల్ట్‌షాప్‌ నిర్వహిస్తున్నట్లు గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు మద్యం కొనుగోలు చేసేందుకు పలువురు వ్యక్తులు అక్కడికి వస్తూ వెళ్లడం విద్యార్థినులు, తల్లిదండ్రుల్లో ఆందోళన కలిగిస్తోందని చెబుతున్నారు. విద్యాసంస్థలు, బాలికల హాస్టళ్ల పరిసరాల్లో ఇలాంటి కార్యకలాపాలు కొనసాగడం వల్ల విద్యార్థినుల భద్రతకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజంతా మద్యం కొనుగోలుదారుల రాకపోకలు సాగుతున్నా సంబంధిత అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు. ఏదైనా అవాంఛనీయ ఘటన జరిగిన తర్వాత స్పందించడం కంటే ముందుగానే పరిస్థితిని నియంత్రించి బాలికలకు సురక్షిత వాతావరణం కల్పించాలని కోరుతున్నారు. కేజీబీవీ, హాస్టల్‌ పరిసరాల్లో జరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్న మద్యం విక్రయాలపై ఎక్సైజ్‌, పోలీసు, విద్యాశాఖ అధికారులు తక్షణమే విచారణ చేపట్టాలని డిమాండ్‌ చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా మద్యం విక్రయాలు జరుగుతున్నట్లు విచారణలో తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు, గ్రామస్థులు కోరుతున్నారు

Original source: prabhanews.com
Read more on Kaizer News