Nagarkurnool: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారెంటీల అమలులో పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ నేత నాగం శశిధర్‌రెడ్డి విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు. నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో వారి నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రజల సమస్యల పరిష్కారం కోసం మరోసారి ఉద్యమాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. ప్రజలతో పాటు ఉద్యోగులు కూడా తమ సమస్యల పరిష్కారం కోసం రోడ్డెక్కి ఆందోళనలు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తామని ఇచ్చిన హామీ ఏమైందని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాష్ట్రంలో కరెంట్ కోతల కారణంగా రైతులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. కల్వకుర్తి ప్రాజెక్టు కాలువల్లో జమ్ము, పూడిక పేరుకుపోయినా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని నాగం శశిధర్‌రెడ్డి విమర్శించారు. వెంటనే కాలువల్లో పేరుకుపోయిన పూడిక, జమ్మును తొలగించి రైతులకు సక్రమంగా నీటి సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి ప్రజలు, రైతులు, ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరారు. సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం, అధికారులు విఫలమైతే ఎమ్మెల్యే ఇంటిని ముట్టడించి పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని ఆయన హెచ్చరించారు