తోర్రూరు టౌన్, ఆంధ్రప్రభ: తెలుగు భాష పరిరక్షణకు ప్రస్తుత పరిస్థితుల్లో భాషాభిమానులు, కవులు, రచయితలు ప్రత్యేక బాధ్యతతో కృషి చేయాలని తెలంగాణ సామాజిక రచయితల సంఘం జిల్లా అధ్యక్షుడు ఇమ్మడి రాంబాబు కోరారు. గిడుగు రామమూర్తి పంతులు 163వ జయంతిని పురస్కరించుకుని ఆగస్టు 29న తెలుగు భాషా దినోత్సవం నిర్వహిస్తున్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రపంచంలో గొప్ప ప్రాచీన భాషల్లో తెలుగు ఒకటని పేర్కొన్నారు. అయితే తెలుగు రాష్ట్రాల్లోనే మాతృభాష వినియోగం తగ్గిపోతున్న పరిస్థితి ఆందోళన కలిగిస్తోందన్నారు. ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు తెలుగు మాట్లాడటం, చదవడం, రాయడం నేర్పించాలని, ఆంగ్ల మాధ్యమంలో చదువుతున్నా తెలుగు భాషపై ప్రావీణ్యం పెంపొందించేలా చూడాలని సూచించారు. విదేశాల్లో నివసిస్తున్న తెలుగు వారు తమ పిల్లలకు ప్రత్యేకంగా తెలుగు నేర్పిస్తుంటే, మన రాష్ట్రాల్లో తెలుగు మాధ్యమ పాఠశాలలపై ఆసక్తి తగ్గడం విచారకరమన్నారు. తెలుగు భాష పరిరక్షణకు గిడుగు రామమూర్తి పంతులు చేసిన సేవలు యువ కవులు, రచయితలు, భాషాభిమానులకు స్ఫూర్తిదాయకమని తెలిపారు. తెలుగు భాషకు ఉన్న శ్రావ్యత, మాధుర్యం, సాహిత్య సంపద విశిష్టమైనవని పేర్కొన్నారు. అధికార భాషగా తెలుగు అమలుకు ప్రతి ఒక్కరూ చిత్తశుద్ధితో వ్యవహరించాలని, సెలవు చీటి నుంచి కార్యాలయ వ్యవహారాల వరకు తెలుగుకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. కార్యాలయాల్లో ఉత్తర ప్రత్యుత్తరాలు తెలుగులోనే కొనసాగాలని, ప్రభుత్వ ఉత్తర్వులను కూడా తెలుగులో విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని ఇమ్మడి రాంబాబు సూచించారు. చిరునామా ఫలకాలు, ప్రజా సూచికలు తెలుగులో ఉండేలా చూడాలన్నారు. 2017లో తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన ప్రపంచ తెలుగు మహాసభల్లో చేసిన తీర్మానాలు పూర్తిస్థాయిలో అమలు కాకపోవడంపై భాషాభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. తెలుగు భాష పరిరక్షణ, అధికార భాషగా అమలు కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు