Kaizer News

ఇంద్రకీలాద్రిపై భక్తిరస జల్లు.. పరవశించిన భక్తజనం

ఇంద్రకీలాద్రిపై భక్తిరస జల్లు.. పరవశించిన భక్తజనం

· State - Telangana · prabhanews.com

ధర్మపథం’ వేదికపై ‘భక్తిరంజని’ సంగీత విభావరి అన్నమయ్య సంకీర్తనలతో ఆధ్యాత్మిక సాగరం కనకదుర్గమ్మ వైభవాన్ని కీర్తించిన గాయనీమణులు మంగళమయంగా ముత్తుస్వామి దీక్షితార్‌ గణపతి స్తుతితో కచేరీ ఆరంభం మధుర గానానికి వయోలిన్‌, మృదంగం తోడై రసరమ్యంగా సాగిన సంగీత విభావరి ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ : విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తిరస గానం మంత్రముగ్ధులను చేసింది. శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘ధర్మపథం’ కార్యక్రమంలో భాగంగా శనివారం సాయంత్రం నిర్వహించిన ‘భక్తిరంజని’ సంగీత విభావరి భక్తులను భక్తిపారవశ్యంలో ముంచెత్తింది. గాయనీమణులు కుమారి కె. భూమిక, కుమారి ఎన్. రిషిత తమ మధుర గాత్రంతో ఆలపించిన భక్తి కీర్తనలు శ్రోతలను విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రముఖ వాగ్గేయకారులు, శాస్త్రీయ సంగీత దిగ్గజాలు రచించిన కీర్తనలను సుస్వరాలతో ఆలపిస్తూ కళాకారులు ఇంద్రకీలాద్రిపై ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పారు. ముత్తుస్వామి దీక్షితార్‌ రచించిన ప్రసిద్ధ కీర్తన ‘శ్రీ మహా గణపతిం భజేహం’ తో వినాయక స్తుతి చేసి కచేరీని ప్రారంభించారు. అనంతరం జగన్మాత కనకదుర్గమ్మ వైభవాన్ని కీర్తిస్తూ ‘చక్కని తల్లికి చాంగుభళా’ కీర్తనను భక్తిభావంతో ఆలపించారు. తాళ్లపాక అన్నమాచార్యుల దివ్య సంకీర్తనలైన ‘అదివో అల్లదివో శ్రీహరి వాసము’, ‘తిరు తిరు జవరాల’, ‘పిడికిట తలంబ్రాల పెండ్లికూతురు’ కీర్తనలను అత్యంత శ్రావ్యంగా ఆలపించారు. అన్నమయ్య సంకీర్తనల్లోని భక్తి భావాన్ని గానంతో ఆవిష్కరించడంతో భక్తులు మంత్రముగ్ధులయ్యారు. కార్యక్రమంలో వయోలిన్‌పై శ్రీ ఎస్‌. హర్షవర్ధన్‌, మృదంగంపై శ్రీమతి జగన్మోహిని అందించిన వాద్య సహకారం గాన విభావరికి మరింత వన్నె తెచ్చింది. గాత్రం, వాద్యాల సమన్వయంతో కార్యక్రమం రసరమ్యంగా సాగింది. కార్యక్రమం అనంతరం ప్రతిభ కనబరిచిన కళాకారుల బృందాన్ని దేవస్థాన అధికారులు, వైదిక కమిటీ సభ్యులు, భక్తులు అభినందించారు. ఆలయ మర్యాదల ప్రకారం కళాకారులకు శ్రీ అమ్మవారి శేషవస్త్రాలు, ప్రసాదాలను అందజేశారు

Original source: prabhanews.com
Read more on Kaizer News