చౌటుప్పల్, ఆంధ్రప్రభ : భార్య మృతి, ఆర్థిక ఇబ్బందులతో మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని తంగడపల్లి గ్రామానికి చెందిన బుంగపట్ల మహేష్ ముదిరాజ్ (33) కొంతకాలంగా తీవ్ర మనోవేదనలో ఉన్నాడు. మహేష్ భార్య స్వప్న 16 నెలల క్రితం ఉరివేసుకుని మృతి చెందింది. ఈ దంపతులకు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. తల్లి మృతి అనంతరం పిల్లలు అమ్మమ్మ ఇంటి వద్దే ఉంటున్నారు. భార్య, పిల్లలకు దూరంగా ఒంటరిగా జీవిస్తున్న మహేష్.. కుటుంబాన్ని కోల్పోయిన బాధతో పాటు ఆర్థిక ఇబ్బందులతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం 11.20 గంటల సమయంలో తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతుడి అన్న మల్లేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు చౌటుప్పల్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ జి. మన్మథ కుమార్ తెలిపారు