ఉదయం 10:30 అయినా విధులకు హాజరుకాని సిబ్బంది.. అధికారుల పర్యవేక్షణపై ప్రశ్నలు ఆంధ్రప్రభ ప్రతినిధి, భూపాలపల్లి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని జిల్లా కలెక్టరేట్ కార్యాలయ ప్రాంగణంలో ఉన్న దాదాపు 50కి పైగా శాఖలకు సంబంధించిన కార్యాలయాల్లో సిబ్బంది విధి నిర్వహణ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. శనివారం ఉదయం 10:30 గంటలు అవుతున్నా కార్యాలయంలో ఒక్క సిబ్బంది కూడా విధులకు హాజరు కాకపోవడంతో కార్యాలయం మొత్తం ఖాళీ కుర్చీలతో దర్శనమిచ్చింది. ప్రభుత్వ కార్యాలయాల్లో సమయపాలన, ఉద్యోగుల హాజరుపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ ఏ మేరకు ఉందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సమయపాలన ఎక్కడ? ప్రజలకు, ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు, బిల్లులు, పెన్షన్ తదితర సేవలతో సంబంధం ఉన్న ట్రెజరీ కార్యాలయంలోనే సిబ్బంది సమయానికి విధులకు హాజరు కాకపోవడం చర్చనీయాంశంగా మారింది. అదేవిధంగా దాదాపు 90 శాతం కు పైగా కార్యాలయాల్లో ఉదయం కార్యాలయానికి వచ్చిన వారికి అధికారులు , సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి నెలకొంది. విధులకు ఆలస్యంగా హాజరయ్యే సిబ్బందిపై అధికారులు చర్యలు తీసుకుంటారా? కార్యాలయ నిర్వహణపై పర్యవేక్షణ ఉంటుందా? అనేది వేచి చూడాలి. జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి