అస్మిత రగ్బీ జిల్లాస్థాయి పోటీల ముగింపు సందర్భంగా ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ నిజామాబాద్ స్పోర్ట్స్, ఆంధ్రప్రభ : క్రీడలతో యువతలో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, పట్టుదల పెంపొందుతాయని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ అన్నారు. జిల్లా రగ్బీ అసోసియేషన్ ఆధ్వర్యంలో నగరంలోని గిరిరాజ్ కళాశాల మైదానంలో నిర్వహించిన అస్మిత రగ్బీ జిల్లాస్థాయి పోటీలు ఆదివారం ఘనంగా ముగిశాయి. ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ క్రీడాకారులను అభినందించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రీడలు కేవలం శారీరక దృఢత్వానికే కాకుండా జీవితంలో క్రమశిక్షణ, సమయపాలన, జట్టుగా పనిచేసే లక్షణాలను పెంపొందిస్తాయని అన్నారు. క్రీడాకారులు గెలుపోటములను సమానంగా స్వీకరిస్తూ మరింత పట్టుదలతో ముందుకు సాగాలని సూచించారు. జిల్లా స్థాయిలో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించి నిజామాబాద్ జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. రగ్బీ క్రీడకు జిల్లాలో ఆదరణ పెరుగుతుండటం అభినందనీయమని, గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా ప్రతిభ కలిగిన క్రీడాకారులను వెలికితీసేందుకు నిర్వాహకులు కృషి చేయాలని ఎమ్మెల్యే సూచించారు. క్రీడాకారులకు అవసరమైన ప్రోత్సాహం అందించేందుకు తన వంతు సహకారం అందిస్తానని తెలిపారు. జిల్లా రగ్బీ అసోసియేషన్ అధ్యక్షుడు రెంజర్ల నరేష్, కార్యదర్శి పి. అబ్బయ్య మాట్లాడుతూ.. అండర్–15, అండర్–18, సీనియర్ మహిళల విభాగాల్లో నిర్వహించిన పోటీల్లో జిల్లా నలుమూలల నుంచి సుమారు 300 మంది క్రీడాకారులు పాల్గొన్నారని తెలిపారు. పోటీల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో జిల్లా రగ్బీ అసోసియేషన్ ట్రెజరర్ నీలగిరి శ్రీనివాస్, వైస్ ప్రెసిడెంట్లు పిల్లి శ్రీకాంత్, స్వామి యాదవ్, బాలమణి, చీఫ్ ప్యాట్రన్ మారయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు