కొలంబో, ఆంధ్రప్రభ : శ్రీలంక క్రికెట్‌కు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. వచ్చే ఏడాది (2027) ఫిబ్రవరిలో జరగనున్న తొలి మహిళల ఛాంపియన్స్ ట్రోఫీ ఆతిథ్య హక్కులను శ్రీలంక కోల్పోయింది. ఆరు జట్లతో నిర్వహించనున్న ఈ టోర్నీని శ్రీలంక నుంచి మరో దేశానికి తరలించనున్నారు. అదే సమయంలో టోర్నీని నిర్వహించే అవకాశం ఉండగా, భారత్ ఆతిథ్యం వహించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. కొత్త ఆతిథ్య దేశాన్ని అక్టోబర్‌లో జరిగే ఐసీసీ బోర్డు సమావేశంలో అధికారికంగా ఖరారు చేయనున్నారు. శ్రీలంక క్రికెట్ బోర్డు వ్యవహారాల్లో ప్రభుత్వ జోక్యం కారణంగానే ఆతిథ్య హక్కులు కోల్పోవాల్సి వచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం శ్రీలంక క్రికెట్ వ్యవహారాలను ప్రభుత్వ ఏర్పాటు చేసిన తాత్కాలిక పాలనా వ్యవస్థ అయిన ట్రాన్స్‌ఫర్మేషన్ కమిటీ పర్యవేక్షిస్తోంది. రాజ్యాంగంలో మార్పులతో పాటు బోర్డు వ్యవహారాలను ఈ కమిటీ నిర్వహిస్తోంది. అయితే రాజకీయంగా నియమితమైన పాలనా వ్యవస్థలను ఐసీసీ గుర్తించదు. ట్రాన్స్‌ఫర్మేషన్ కమిటీ ఏర్పాటు తర్వాత శ్రీలంక క్రికెట్ ప్రతినిధులు ఐసీసీ బోర్డు సమావేశాల్లో కూడా పాల్గొనడం లేదని సమాచారం. ఈ పరిణామాల నేపథ్యంలోనే మహిళల ఛాంపియన్స్ ట్రోఫీని శ్రీలంక నుంచి తరలించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మార్పు శ్రీలంక మహిళల జట్టుపై కూడా తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ఆతిథ్య దేశంగా ఉన్న కారణంగా శ్రీలంక జట్టుకు టోర్నీలో స్థానం దక్కే అవకాశం ఉండేది. కానీ వేదిక మారడంతో ఇప్పుడు ర్యాంకింగ్స్ ఆధారంగా అర్హత నిర్ణయించే పరిస్థితి ఏర్పడింది. ఈ టోర్నీలో కేవలం ఐసీసీ ర్యాంకింగ్స్‌లో తొలి ఆరు స్థానాల్లో ఉన్న జట్లకే అవకాశం ఉంటుంది. తాజా ర్యాంకింగ్స్ ప్రకారం శ్రీలంక ప్రస్తుతం ఏడో స్థానంలో ఉంది. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, భారత్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా తొలి ఐదు స్థానాల్లో ఉండగా, వెస్టిండీస్ ఆరో స్థానంలో ఉంది. శ్రీలంకకు ఆతిథ్య జట్టు హోదా లేకపోతే వెస్టిండీస్‌కు మహిళల ఛాంపియన్స్ ట్రోఫీలో చోటు దక్కే అవకాశం ఉంది. కాగా, గత మూడు సంవత్సరాల్లో శ్రీలంక ఐసీసీ టోర్నీ ఆతిథ్యాన్ని కోల్పోవడం ఇది రెండోసారి. 2023లో ఇదే తరహా ప్రభుత్వ జోక్యం కారణంగా 2024 పురుషుల అండర్-19 ప్రపంచకప్‌ను శ్రీలంక నుంచి తొలగించి దక్షిణాఫ్రికాకు తరలించారు. ఇప్పుడు మహిళల క్రికెట్‌లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న తొలి ఛాంపియన్స్ ట్రోఫీ కూడా శ్రీలంక చేజారడం ఆ దేశ క్రికెట్‌కు మరో పెద్ద ఎదురుదెబ్బగా మారింది