మూడు రోజులు అప్రమత్తం గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు.. సెప్టెంబర్ 24న పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు హైదరాబాద్, ఆంధ్రప్రభ : తెలంగాణకు వాతావరణ శాఖ భారీ వర్ష హెచ్చరిక జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉండటంతో రాష్ట్రంలో రానున్న మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. ఆది, సోమ, మంగళవారాల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. ఈ సమయంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. ఉత్తర అండమాన్ సముద్రం, పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతోంది. ఇది సోమవారం (సెప్టెంబర్ 21) నాటికి తూర్పు మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశం ఉంది. అనంతరం మంగళవారం నాటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంగా బలపడుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. బుధవారం ఉదయానికి ఈ వాయుగుండం ఉత్తర ఆంధ్రప్రదేశ్-దక్షిణ ఒడిశా తీరాలకు సమీపంలోకి చేరుకునే అవకాశం ఉంది. దీని ప్రభావంతో తెలంగాణలో వర్షాలు పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. సెప్టెంబర్ 24న తెలంగాణలోని పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ ప్రత్యేక హెచ్చరిక జారీ చేసింది. మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. అలాగే ఆదిలాబాద్, కొమురం భీమ్ ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల తదితర జిల్లాల్లో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. దక్షిణ కోస్తాంధ్ర, దాని పరిసర పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. గత 24 గంటల్లో తెలంగాణలో పలు ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదైంది. నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్‌లో అత్యధికంగా 13.9 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ములుగు జిల్లా ఏటూరునాగారంలో 10.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. తాజా వర్ష హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో జాగ్రత్తలు పాటించాలని కోరారు