మట్టిని తవ్వితే బయటపడేది కేవలం మట్టి కాదు.. రాళ్లను పరిశీలిస్తే కనిపించేది కేవలం రాళ్లు కాదు.. వాటి వెనుక వేల ఏళ్ల తెలంగాణ చరిత్ర దాగి ఉంటుంది. ఆ చరిత్ర ఆనవాళ్లను వెతుకుతూ.. ఆదిమానవుల ఆవాసాల నుంచి మెగాలిథిక్ కట్టడాల వరకు.. శిలాచిత్రాల నుంచి శాసనాల వరకు.. ఊరూరా తిరుగుతూ చరిత్రను వెలికితీస్తున్నారు జనగామకు చెందిన రెడ్డి రత్నాకర్ రెడ్డి. ఈయన ‘500 డేస్ ఛాలెంజ్ ఆఫ్ మై డిస్కవరీ’ పేరిట తెలంగాణలో చేపట్టిన ఆదిమానవుల ఆనవాళ్ల వేట 530 రోజులుగా కొనసాగుతోంది. ప్రతిరోజూ ఒక కొత్త చారిత్రక, పురావస్తు లేదా వారసత్వ విశేషాన్ని ప్రజలకు పరిచయం చేస్తూ నిరంతర అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ వినూత్న ప్రయాణం ద్వారా వేలాదిమంది విద్యార్థులు, యువత, చరిత్రాభిమానుల్లో పరిశోధనా స్ఫూర్తిని పెంపొందిస్తున్నారు. రోజుకో చారిత్రక విశేషాన్ని వెలుగులోకి తెస్తూ తెలంగాణ చరిత్రను ప్రజలకు చేరువ చేస్తున్నారు. తెలంగాణ వారసత్వ సంపద పరిరక్షణ, ప్రజల్లో చారిత్రక అవగాహన పెంపొందించాలనే ఉన్నతాశయంతో పురావస్తు పరిశోధకుడైన రెడ్డి రత్నాకర్ రెడ్డి మరో 20 మంది పరిశోధకులతో కలిసి జనగామ కేంద్రంగా మాన్యుమెంట్స్, అనిసెంట్ తెలంగాణ ట్రెడిషన్స్ అండ్ ఇన్స్ట్రిప్టన్స్ ఫౌండేషన్ (మట్టి ఫౌండేషన్)ను ఏర్పాటు చేశారు. ప్రతీ పాఠశాలలో స్థానిక చరిత్ర, వారసత్వం, పర్యావరణం, జానపద సంపద, సామాజిక అధ్యయనాలపై విద్యార్థుల్లో పరిశోధనా దృక్పథాన్ని పెంపొందించేలా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు వీలుగా సోషల్ ల్యాబ్ మూవ్మెంట్ చేపట్టారు. ఈ ఉద్యమం ద్వారా విద్యార్థులు తమ గ్రామాన్నే ఒక పరిశోధనా ప్రయోగశాలగా భావించి నేర్చుకునే విధానాన్ని ప్రోత్సహించడం ఈ ఉద్యమం ప్రధాన లక్ష్యం. పురాతన చారిత్రక ఆధారాలను సేకరించి వాటితో పాఠశాలల్లో మ్యూజియం ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో తమ మట్టి ఫౌండేషన్ పనిచేస్తుందని వ్యవస్థాపక అధ్యక్షుడు, పురావస్తు పరిశోధకుడు రెడ్డి రత్నాకర్ రెడ్డి చెప్పారు. జనగామ జిల్లాలో ఏడు ప్రాచీన వింతలను మట్టి ఫౌండేషన్ పురావస్తు పరిశోధకులు వెలుగులోకి తీసుకువచ్చారు. ఇందులో ఒకటైన భారతదేశంలోని ఎత్తైన మానవాకృత శిల్పం జనగామ జిల్లా వడ్లకొండలో గుర్తించారు. బచ్చన్నపేట మండలం కొడవటూరులో ఉత్తరాయణం, దక్షిణాయనాన్ని సూచించే రాళ్లతోటను గుర్తించారు. ప్రపంచంలోనే అతి బరువైన క్యాప్స్ స్టోన్ ఉన్న సమాధిని జనగామ జిల్లా సిద్ధంకి గుట్ట దిగువన గుర్తించారు. జనగామ జిల్లాలో 50 వరకు శాసనాలను 40కి పైగా నిలువురాళ్లను గుర్తించినట్లు రత్నాకర్ తెలిపారు. జనగామ, సిద్దిపేట జిల్లా శివార్లలో ఉన్న సంగీతం వినిపించే శిలలతో కూడిన సోలామైల్ ఏనెలను పరిశోధించారు. ఈ శిలలపై నవీన శిలాయుగపు రాతి పనిముట్లు నూరుకున్న తావులు, మెగాలిక్ నిర్మాణాలు, గంటు చిత్రాలు గుర్తించారు. ఇవే కాకుండా తెలంగాణలో అరుదైన అయ్యనార్ శిల్పాలను జనగామ జిల్లా ఎల్లంల గ్రామంలోనూ, నల్గొండ జిల్లాలో గుర్తించారు. పండితగల్లు, సిడితల వంటి అరుదైన వీరగల్లు శిల్పాలను మట్టి ఫౌండేషన్ పురావస్తు పరిశోధకులు గుర్తించారు. రత్నాకర్ రెడ్డి పరిశోధనలో భాగంగా శిలాయుగం నాటి చారిత్రిక ఆధారాలను సేకరించి తన ఇంటినే ఒక మ్యూజియంగా మార్చారు. తాను