ఉరవకొండ, (ఆంధ్రప్రభ) : పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని ఉరవకొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ టి. శైలజారాణి అన్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేందుకు విద్యార్థులు ముందుండాలని పిలుపునిచ్చారు. స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో శనివారం స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ‘సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వద్దు.. పర్యావరణాన్ని కాపాడుదాం’ అనే అంశంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ శైలజారాణి మాట్లాడుతూ.. ప్లాస్టిక్ రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. ప్లాస్టిక్ కవర్లకు బదులుగా గుడ్డ సంచులు, జ్యూట్ బ్యాగులు ఉపయోగించాలని సూచించారు. కళాశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం అందరి బాధ్యత అని పేర్కొన్నారు. ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్, స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కోఆర్డినేటర్ విష్ణుప్రియ, ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ సుధాకర్ మాట్లాడుతూ.. ప్లాస్టిక్ వల్ల కలిగే నష్టాలను విద్యార్థులకు వివరించారు. అనంతరం కళాశాల నుంచి బస్టాండ్ కూడలి వరకు విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ప్లకార్డులు, నినాదాలతో ప్రజలకు ప్లాస్టిక్ వినియోగం వల్ల కలిగే నష్టాలపై అవగాహన కల్పించారు. బస్టాండ్, బహిరంగ ప్రదేశాల్లో ప్లాస్టిక్ కవర్లను సేకరించారు. దుకాణదారులు, ప్రయాణికులకు అవగాహన కరపత్రాలు పంపిణీ చేశారు. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్న వారికి ప్లాస్టిక్ సంచులకు ప్రత్యామ్నాయంగా గుడ్డ సంచులను అందించారు. ఈ కార్యక్రమంలో జంతుశాస్త్ర అధ్యాపకురాలు జమీలా బీబీ, స్టాటిస్టిక్స్ అధ్యాపకులు వెంకటరాముడు, నీలి వెంకటేశులు, ప్రభాకర్, ప్రశాంత్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర ప్రతిజ్ఞ చేశారు