కాకతీయ వైభవం ప్రతిబింబించేలా రూపకల్పన.. రూ.417 కోట్లతో అభివృద్ధి పనులు.. టెండర్లు పిలిచిన ఏఏఐ.. డిసెంబర్‌లో ప్రధాని శంకుస్థాపన! ఉమ్మడి వరంగల్, ఆంధ్రప్రభ ప్రతినిధి : రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత రెండో విమానాశ్రయంగా మామునూరు ఎయిర్‌పోర్టు అందుబాటులోకి రానుంది. నైజాం కాలంలోనే ఏర్పాటైన ఈ విమానాశ్రయాన్ని పునరుద్ధరించి, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కొత్త రూపంలో అభివృద్ధి చేసేందుకు అడుగులు పడుతున్నాయి. కాకతీయులు ఏలిన ఓరుగల్లు గడ్డపై ఏర్పాటు కానున్న ఈ విమానాశ్రయానికి సాంస్కృతిక సొబగులు అద్దనున్నారు. కాకతీయుల కళా వైభవం ఉట్టిపడేలా విమానాశ్రయ టెర్మినల్ భవనాన్ని ప్రత్యేకంగా రూపకల్పన చేస్తున్నారు. కాకతీయ సామ్రాజ్యానికి రాజధానిగా విలసిల్లిన వరంగల్ నగరం చారిత్రక, సాంస్కృతిక వైభవానికి ప్రసిద్ధి. ఈ నేపథ్యంలో మామునూరు విమానాశ్రయాన్ని తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించేలా తీర్చిదిద్దేందుకు ప్రతిపాదనలు రూపొందించినట్లు సమాచారం. వరంగల్ సమీపంలోని మామునూరులో నైజాం కాలంలోనే విమానాశ్రయం ఉండేది. కొంతకాలం తర్వాత అది మూతపడింది. తిరిగి విమానాశ్రయాన్ని పునరుద్ధరించాలనే డిమాండ్ దశాబ్దాలుగా కొనసాగుతోంది. ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక చొరవతో ఈ ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) పరిధిలో ఉన్న మామునూరు విమానాశ్రయ భూముల్లో ఆధునిక విమానాశ్రయాన్ని ఏర్పాటు చేసేందుకు కేంద్రం అనుమతులు ఇచ్చింది. విమానాశ్రయ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం 225 ఎకరాల భూమిని సేకరించి ఏఏఐకి అందజేసింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పలుమార్లు కేంద్ర మంత్రులను కలిసి మామునూరులో విమానాశ్రయం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం మామునూరు ప్రాంతంలో మొత్తం 949 ఎకరాల భూమి అందుబాటులోకి రావడంతో విమానాశ్రయ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. ఏఏఐ అధికారులు పలుమార్లు ప్రతిపాదిత ప్రాంతాన్ని సందర్శించి విమానాశ్రయానికి అవసరమైన మౌలిక వసతులు, భౌగోళిక పరిస్థితులను పరిశీలించారు. కాజీపేటలోని ఎన్‌ఐటీ ప్రొఫెసర్ల బృందం కూడా ప్రతిపాదిత విమానాశ్రయ ప్రాంతంలో సాంకేతిక పరీక్షలు నిర్వహించింది. భూసారం, నైసర్గిక స్వరూపం తదితర అంశాలను పరిశీలించిన సాంకేతిక నిపుణులు తమ నివేదికను ఏఏఐకి అందజేశారు. సాంకేతికంగా విమానాశ్రయ ఏర్పాటుకు అనుకూల పరిస్థితులు ఉన్నట్లు నివేదికలు రావడంతో ఏఏఐ అధికారులు తదుపరి చర్యలను వేగవంతం చేశారు. పరిపాలనా, సాంకేతిక అనుమతులు లభించడంతో విమానాశ్రయ నిర్మాణానికి అవసరమైన పనుల కోసం ఏఏఐ టెండర్లు ఆహ్వానించింది. తొలి దశలో రూ.203 కోట్లతో రన్‌వే ఆధునీకరణ, టెర్మినల్ భవనానికి అనుసంధాన రహదారులు, విమానాల పార్కింగ్, గ్రౌండ్ సపోర్ట్ సదుపాయాల వంటి పనులు చేపట్టనున్నారు. రెండో దశలో రూ.213 కోట్లతో నూతన దేశీయ ప్రయాణికుల టెర్మినల్ భవనం, ఏటీసీ టవర్, టెక్నికల్ బ్లాక్, విద్యుత్ సబ్‌స్టేషన్, ఫైర్ స్టేషన్, ఈఅండ్‌ఎం వర్క్‌షాప్ తదితర మౌలిక వసతులను నిర్మించనున్నారు. మొత్తంగా రూ.417 కోట్లతో విమానాశ్రయ అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రణాళిక రూపొందించారు. ఈ నెల 28న వరంగల్ విమానాశ్రయంలో