Kaizer News

కుమార్తెను నడుముకు కట్టుకుని బావిలో దూకిన తల్లి

కుమార్తెను నడుముకు కట్టుకుని బావిలో దూకిన తల్లి

· State - Telangana · prabhanews.com

దండేపల్లి, ఆంధ్రప్రభ: మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం లింగాపూర్ గ్రామంలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. తన ఆరేళ్ల కుమార్తెను నడుముకు కట్టుకుని ఓ తల్లి బావిలో దూకడంతో ఇద్దరూ మృతి చెందారు. ఈ విషాద ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. చిన్నారిని వెంట తీసుకుని తల్లి ప్రాణాలు తీసుకోవడం స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. గ్రామానికి చెందిన గోట్ల లచ్చన్న కుమార్తె గోట్ల రజిత (28)కు జగిత్యాల జిల్లా ఎనుగుమట్లకు చెందిన వ్యక్తితో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే గత కొద్ది రోజులుగా రజిత తన ఇద్దరు పిల్లలతో కలిసి లింగాపూర్‌లోని తల్లిగారి ఇంట్లో ఉంటున్నట్లు సమాచారం. ఆదివారం ఉన్నట్టుండి రజిత తన ఆరేళ్ల కుమార్తెను నడుముకు కట్టుకుని గ్రామంలోని బావిలో దూకినట్లు తెలిసింది. ఈ ఘటనలో తల్లీకూతుళ్లు ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. విషయం తెలిసిన కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. అనంతరం మృతదేహాలను బావి నుంచి వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం లక్షెట్టిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తల్లీకూతుళ్ల మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. వివాహం తర్వాత భర్తతో కలిసి జీవనం సాగిస్తున్న రజిత.. కొద్ది రోజులుగా పుట్టింట్లో ఉంటున్నట్లు తెలుస్తోంది. కుటుంబ కలహాలు ఉన్నాయా? లేక మరేదైనా కారణం ఉందా? అన్నది ప్రస్తుతం తెలియరాలేదు. ఎలాంటి కారణంతో ఈ ఘటనకు పాల్పడ్డారన్నది పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. తన చిన్నారి కుమార్తెను నడుముకు కట్టుకుని బావిలో దూకడం స్థానికుల మనసులను కలిచివేసింది. ఒకేసారి తల్లీకూతుళ్లను కోల్పోవడంతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఘటనకు గల పూర్తి కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు

Original source: prabhanews.com
Read more on Kaizer News