Kaizer News

మన్నెంపల్లిలో టెన్షన్‌.. టెన్షన్‌

మన్నెంపల్లిలో టెన్షన్‌.. టెన్షన్‌

· State - Telangana · ntnews.com

గ్రామ పంచాయతీ పాత భవనం కూల్చివేతలో తీవ్ర ఉద్రిక్తత నోటీసులు ఇవ్వకుండా ఎలా కూల్చివేస్తారంటూ అడ్డుకున్న సర్పంచ్‌, పంచాయతీ పాలకవర్గం పోలీసులతో పాలకవర్గం వాగ్వాదం సర్పంచ్‌ ఆత్మహత్యాయత్నం తిమ్మాపూర్‌, సెప్టెంబర్‌ 19: కరీంనగర్‌ జిల్లా తిమ్మాపూర్‌ మండలం మన్నెంపల్లిలో శనివారం ఉదయం జీపులు, లాఠీలతో పోలీస్‌ సిబ్బంది దిగడంతో గ్రామస్తుల్లో టెన్షన్‌ నెలకొన్నది. వివరాల్లోకి వెళ్తే.. మన్నెంపల్లి పాత గ్రామ పంచాయతీ భవనాన్ని కూల్చేందుకు అధికారులు తెల్లవారుజామున భారీ పోలీసు బందోబస్తు మధ్య పొక్లెయిన్ల్లతో రాగా.. సర్పంచ్‌ పొన్నం సునీతాఅనిల్‌గౌడ్‌ అడ్డుకున్నారు. జీపీ పాత భవనాన్ని గ్రామ పంచాయతీ ఇతర కార్యకలాపాలకు వాడుకునేందుకు తీర్మానం చేశామని.. దానిని కూల్చవద్దంటూ వేడుకున్నారు. బిల్డింగ్‌ శిథిలావస్థలో ఉన్నదని, ఇంజనీరింగ్‌ అధికారులు ఇచ్చిన నివేదిక ప్రకారం కూల్చేయడానికి కలెక్టర్‌ ఆదేశాలు ఇచ్చారని అధికారులు చెప్పారు. ఈ భవనాన్ని కూల్చి దాని స్థానంలో మహిళా సంఘాల కోసం స్థలం కేటాయించామని పాలకవర్గ సభ్యులు అధికారులకు వివరించారు. అధికార పార్టీ నేతలకు తలొగ్గి, పాలకవర్గ తీర్మానాన్ని పట్టించుకోకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని సర్పంచ్‌ మండిపడ్డారు. సర్పంచుల ఫోరం మండల అధ్యక్షురాలైన తన పరిస్థితే ఇలా ఉంటే సాధారణ సర్పంచుల పరిస్థితి ఏందని ప్రశ్నించారు. దీంతో అధికారులకు పాలకవర్గానికి మధ్య వాగ్వాదం చోటుచేసుకున్నది. ఈ క్రమంలో సర్పంచ్‌ భర్త పొన్నం అనిల్‌ను తిమ్మాపూర్‌ సీఐ బొల్లం రమేశ్‌ బలవంతంగా బలగాలతో లాకెళ్లి ఎల్‌ఎండీ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. తన భర్తను అక్రమంగా అరెస్ట్‌ చేస్తున్నారంటూ సర్పంచ్‌ సునీత ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీస్‌ వాహనానికి అడ్డుపడగా పోలీసులు బలవంతంగా పకకు తీసుకెళ్లారు. దీంతో ఉద్వేగానికి లోనైన ఆమె పకనే ఉన్న గ్రామ పంచాయతీ నూతన భవనంలోకి వెళ్లి తలుపులు పెట్టుకుని ఆత్మహత్యకు యత్నించింది. పోలీస్‌ సిబ్బంది వెంటనే తలుపులు నెట్టి ఆమె నుంచి పెట్రోల్‌డబ్బాను తీసుకుని పడేశారు. అనంతరం పోలీసులు, పంచాయతీరాజ్‌ శాఖ అధికారులు పాత భవనాన్ని నేలమట్టం చేయించారు. జెండా గద్దెను సైతం జేసీబీతో తొలగింపజేశారు. మన్నెంపల్లిలో ఉద్రిక్తతల నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ నాయకులు సర్పంచ్‌కు మద్దతు పలికారు. పార్టీ మండలాధ్యక్షుడు రావుల రమేశ్‌, రాష్ట్ర నాయకులు కేతిరెడ్డి దేవేందర్‌రెడ్డి, ఉల్లెంగుల ఏకానందం, పాశం అశోక్‌రెడ్డి, తదితరులు గ్రామానికి చేరుకుని సర్పంచ్‌ దంపతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామంలో పోలీస్‌ బలగాలను పెట్టి దౌర్జన్యం చేయడం సరికాదన్నారు. ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అధికారాన్ని అడ్డుపెట్టుకుని నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని.. పాత బిల్డింగ్‌ కూల్చేందుకు రాజకీయం చేయడం కరెక్ట్‌ కాదని మండిపడ్డారు. అధికారులపై చట్టపరమైన చర్యలకు సిద్ధమవుమవుతామని చెప్పారు

Original source: ntnews.com
Read more on Kaizer News