విద్యార్థుల్లో భాషా నైపుణ్యాల కృషి చేయాలి ఉపాధ్యాయులదే కీలక పాత్ర, ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి నాగర్‌కర్నూల్, ఆంధ్రప్రభ : ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు విద్యాబోధనతోపాటు వ్యక్తిత్వ వికాసం, మానవీయ విలువలను పెంపొందించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్‌రెడ్డి అన్నారు. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు. శనివారం నాగర్‌కర్నూల్ పట్టణంలోని వెలుమ ఫంక్షన్ హాల్‌లో రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్ తెలంగాణ రాష్ట్రం ఆధ్వర్యంలో నిర్వహించిన హిందీ దినోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా హిందీ ఉపాధ్యాయులను ఉద్దేశించి మాట్లాడుతూ.. విద్యార్థుల్లో భాషా నైపుణ్యాలను పెంపొందించడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమన్నారు. భాషల పరిరక్షణతోనే సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించగలమని చెప్పారు. విద్యార్థులకు పాఠ్యాంశాలను బోధించడంతోపాటు వారిలో మంచి ఆలోచనా విధానం, క్రమశిక్షణ, నైతిక విలువలు, సామాజిక బాధ్యతను పెంపొందించేలా ఉపాధ్యాయులు మార్గనిర్దేశం చేయాలని సూచించారు. విద్యార్థుల్లో హిందీ భాషపై ఆసక్తి, అభిరుచి పెంపొందించేలా బోధనా పద్ధతులను మరింత సరళంగా, ఆకర్షణీయంగా రూపొందించాలని అన్నారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఎమ్మెల్యే తెలిపారు. హిందీ భాష అభివృద్ధికి, విద్యార్థుల్లో భాషా నైపుణ్యాల పెంపునకు కృషి చేస్తున్న హిందీ ఉపాధ్యాయులను అభినందించారు. హిందీ సబ్జెక్టులో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఉపాధ్యాయులను ఎమ్మెల్యే రాజేష్‌రెడ్డి, డీఈఓ ఏ. రమేష్‌కుమార్ చేతుల మీదుగా సన్మానించి ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్ జిల్లా అధ్యక్షులు విజయ్‌కుమార్ ఉపాధ్యాయుల సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో నాగర్‌కర్నూల్ మున్సిపల్ చైర్మన్ తీగల సునేంద్ర, మార్కెట్ కమిటీ చైర్మన్ రమణారావు, రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్ ప్రతినిధులు హమ్ హరూన్, ఎండీ బురహన్, షాకిర్ పాషా, జహంగీర్, నాగేశ్వరరావు, రూప్ల నాయక్, సాజిద్, శ్రీనివాసులు, వెంకటరాజు, బసవయ్య, కురుమూర్తి, రాజునాయక్ తదితరులు, హిందీ ఉపాధ్యాయులు పాల్గొన్నారు