Kaizer News

అల్లూరిగా అన్నగారు.. సినిమా ప్రారంభించాక కూడా ఎందు

అల్లూరిగా అన్నగారు.. సినిమా ప్రారంభించాక కూడా ఎందుకు ఆగిపోయిందంటే..?

· Entertainment · tv9telugu.com

చరిత్ర ఎప్పటికప్పుడు మహాపురుషులను సృష్టిస్తూనే ఉంటుంది. అటువంటి మహనీయుడే అల్లూరి సీతారామరాజు. స్వాతంత్ర సమరాన్ని రక్తాక్షరాలతో లిఖించిన సంగ్రామ సింహం, తెలుగుజాతి పౌరుషాన్ని బ్రిటిష్ పాలకులకు చవిచూపించిన మన్నెం వీరుని కథను తెరకెక్కించి, ఆ పాత్రను పోషించాలనే కోరిక నందమూరి తారకరామారావుకు తన సినీ జీవితంలో ఒక గొప్ప కలలో ఉండేది. ఈ కల నెరవేరకపోయినా, దాని కోసం ఆయన చేసిన ప్రయత్నాలు, రికార్డు చేసిన ఒక అరుదైన పాట చరిత్రలో నిలిచిపోయాయి. ఎన్టీఆర్‌కు అల్లూరి సీతారామరాజు పాత్ర పోషించాలనే కోరిక 1954లో వచ్చిన అగ్గిరాముడు చిత్ర నిర్మాణ సమయంలో కలిగింది. ఆ సినిమాలో బుర్రకథ పితామహుడు షేక్ నాజర్ తన బృంద సభ్యులతో కలిసి చెప్పిన అల్లూరి సీతారామరాజు బుర్రకథ సన్నివేశం ఉంది. పదిహేను నిమిషాల పాటు సాగే ఆ బుర్రకథను వింటున్నప్పుడు ఎన్టీఆర్, భానుమతితో పాటు ప్రేక్షకులు కూడా ఉత్తేజితులయ్యేవారు. అప్పుడే అల్లూరి సీతారామరాజు సినిమా తీయాలనే కోరిక ఎన్టీఆర్‌కు బలంగా నాటుకుంది. అప్పటికే ఎన్టీఆర్ నేషనల్ ఆర్ట్స్ సంస్థను నెలకొల్పి పిచ్చి పుల్లయ్య చిత్రాన్ని నిర్మించారు. తోడుదొంగలు చిత్రం నిర్మాణంలో ఉంది. ఆ తర్వాత తన తమ్ముడు త్రివిక్రమరావుతో అల్లూరి సీతారామరాజు చిత్ర నిర్మాణం గురించి చర్చించారు. ఆయన కూడా సానుకూలంగా స్పందించడంతో, 1955లో ఆ సినిమా నిర్మాణానికి ఎన్టీఆర్ శ్రీకారం చుట్టారు. సముద్రాల, పింగళి వంటి ప్రముఖ రచయితలు అందుబాటులో ఉన్నా, సీతారామరాజు మీద విస్తృతంగా పరిశోధనలు చేసిన తూర్పు గోదావరి జిల్లాకు చెందిన పడాల రామారావుకి రచనా బాధ్యతలు అప్పగించారు. కళా దర్శకుడు మాధవపెద్ది గోఖలేతో అల్లూరి గెటప్ స్కెచ్ తయారు చేయించి, ఆ ప్రకారం మేకప్ వేయించుకుని స్టిల్స్ కూడా దిగారు ఎన్టీఆర్. అందరూ బాగుందని చెప్పడంతో, జైసింహ చిత్రం తర్వాత ఈ సినిమా తీయాలని నందమూరి సోదరులు నిర్ణయించుకున్నారు. 1955 అక్టోబర్ 21న జైసింహ విడుదలై ఘనవిజయం సాధించింది. ఆ ఉత్సాహంతోనే విప్లవజ్యోతి అల్లూరి సీతారామరాజు చిత్ర నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. బయటి చిత్రాలతో బిజీగా ఉండడంతో వెంటనే షూటింగ్ ప్రారంభించే వీలు లేకపోవడం వల్ల పడాలతో పకడ్బందీగా స్క్రిప్ట్ తయారు చేయించారు. ఆ తర్వాత 1957 జనవరి 17న వాహిని స్టూడియోలో పాటల రికార్డింగ్ ప్రారంభించారు. హర హర హర మహా ఓంకార నాదాన పొంగరా ఉప్పొంగి ఓ తెలుగు బిడ్డ స్వాతంత్ర సమరాంగణాన అంటూ పడాల రామారావు రాసిన పాటను సంగీత దర్శకుడు టి.వి. రాజు సారథ్యంలో రికార్డు చేశారు. ఈ పాటను ఘంటసాల, మాధవపెద్ది సత్యం, పిఠాపురం నాగేశ్వరరావు, ఎం.ఎస్. రామారావు పాడారు. ఆ రోజుల్లో ఈ పాటను రికార్డు చేయడానికి 12 వేల రూపాయలు ఖర్చయ్యాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో ఎన్టీఆర్ మాట్లాడుతూ త్వరలోనే చిత్ర నిర్మాణం ప్రారంభిస్తామని, సాంకేతిక నిపుణుల వివరాలు వెల్లడించారు. ఈ వార్త నందమూరి అభిమానుల్లో ఆనందాన్ని కలిగించింది. అయితే ప్రకటించినట్లుగా విప్లవజ్యోతి అల్లూరి సీతారామరాజు సినిమా షూటింగ్ ప్రారంభం కాలేదు. ఏవో ఆవాంతరాలు, అడ్డంకులు వచ్చాయి. స్క్రిప్ట్ మీద అనుమానాలు రావడంతో ఆ ప్రాజెక్టును తాత్కాలికంగా పక్కన పెట్టి పాండురంగ మహత్

Original source: tv9telugu.com
Read more on Kaizer News