తెలంగాణా రాష్ట్రానికి కేంద్రం అనేక నిధులు కేటాయిస్తుందని, ఆ నిధులను సద్వినియోగం చెయ్యాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా లో కేంద్ర బొగ్గు మరియు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొని మాట్లాడారు. పర్యటనలో భాగంగా జోగులాంబ గద్వాల జిల్లాకు, తెలంగాణా రాష్ట్ర రైల్వే, పర్యాటక రంగాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. జోగులాంబ ఆలయ అభివృద్ధికి కేంద్ర పర్యాటక శాఖ ద్వారా ఇప్పటికే రూ.37 కోట్ల నిధులు మంజూరు చేశామని, దేవాలయాల అంతర్గత అభివృద్ధి కోసం కేంద్ర సాంస్కృతిక శాఖ, ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ద్వారా కూడా నిధులు ఖర్చు చేస్తున్నామని చెప్పారు. పనులు వేగవంతంగా పూర్తి చెయ్యాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే అయితే బస్‌స్టాండ్, బ్రిడ్జి, రోడ్డు వంటి కొన్ని పనులు పెండింగ్‌లో ఉండటంతో అభివృద్ధి పనులకు ఆటంకాలు ఏర్పడుతున్నాయని తెలిపారు. కేంద్రం నిధులు మంజూరు చేసినప్పటికీ.. రాష్ట్ర ప్రభుత్వం టెండర్లు పిలిచి, కాంట్రాక్టర్లను నియమించి, పనులను పర్యవేక్షించి పూర్తి చేయాల్సిన బాధ్యత ఉందన్నారు. అభివృద్ధి పనులన్నింటినీ ఏ టూ జెడ్ రివ్యూ చేసి వేగవంతంగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, జిల్లా కలెక్టర్‌ను కోరుతున్నానని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. జోగులాంబ అమ్మవారి శక్తిపీఠానికి దేశవ్యాప్తంగా, విదేశాల నుంచి కూడా భక్తులు వస్తుంటారని, వారి సౌకర్యార్థం మౌలిక వసతులను మరింత అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇదే సమయంలో తెలంగాణలో రైల్వే అభివృద్ధిపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని కిషన్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలోని 42 రైల్వే స్టేషన్లను ఏకకాలంలో ఆధునికీకరిస్తున్నామని, 2027 నాటికి పనులను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. సామాన్యులపై ధరల పిడుగు..దేశంలో తెలంగాణాలోనే ధరల మోత..ఎందుకంటే! ప్రధానమంత్రి మోదీ చేతుల మీదుగా జోగులాంబ రైల్వేస్టేషన్ ప్రారంభం అందులో భాగంగా జోగులాంబ రైల్వే స్టేషన్ పనులు దాదాపు 95 శాతం పూర్తయ్యాయని, మిగిలిన పనులను త్వరగా పూర్తి చేసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా వర్చువల్‌గా ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. భక్తులతో పాటు స్థానిక ప్రజలకు హైదరాబాద్, కర్నూలు తదితర ప్రాంతాలకు రాకపోకలు సాగించేందుకు ఈ స్టేషన్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు