యువత భవితకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల డబుల్ భరోసా వైసీపీ హయాంలో ఉద్యోగాల అమ్మకం.. రూ.150 కోట్ల దోపిడీ: ఎమ్మెల్యే గిత్త జయసూర్య నందికొట్కూరు, ఆంధ్రప్రభ: యువశక్తి ఏ మాత్రం నిర్వీర్యం కాకూడదన్నదే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజన్ అని, యువశక్తి అణుశక్తి కన్నా మిన్న అని నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య అన్నారు. నందికొట్కూరు పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శనివారం నిర్వహించిన ‘యువత భవితకు భరోసా’ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యువత భవిష్యత్తుకు భరోసా కల్పించేందుకు సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ ప్రత్యేక చర్యలు చేపడుతున్నారని తెలిపారు. ఎన్డీయే ప్రభుత్వ హయాంలో ఉద్యోగ నియామకాల్లో పూర్తి పారదర్శకత పాటిస్తూ ప్రతిభకే పట్టం కడతామని హామీ ఇచ్చారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో యువతకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆరోపించారు. 2018 ఏపీపీఎస్సీ గ్రూప్-1 నియామకాల్లో సుమారు రూ.150 కోట్ల అక్రమాలు జరిగాయని, డిప్యూటీ కలెక్టర్ పోస్టుకు రూ.2.5 కోట్లు, ఆర్టీఓ పోస్టుకు రూ.కోటి, డీఎస్పీ పోస్టుకు రూ.50 లక్షల చొప్పున వసూలు చేశారని ఆరోపించారు. జవాబు పత్రాలను సైతం వదల్లేదని ఎమ్మెల్యే అన్నారు. ఒరిజినల్ జవాబు పత్రాలను ప్రభుత్వ స్ట్రాంగ్‌రూమ్ నుంచి ప్రైవేట్ రిసార్ట్‌కు తరలించి 84 రోజుల పాటు అక్కడే ఉంచారని ఆరోపించారు. ఫోరెన్సిక్ పరీక్షల్లో 736 జవాబు పత్రాల్లో 718 పత్రాల్లో అంటే 97.55 శాతం పత్రాల్లో అనధికారిక దిద్దుబాట్లు జరిగినట్లు తేలిందన్నారు. ఇది యువత గొంతు కోయడమేనని ఆవేదన వ్యక్తం చేశారు. యువతే దేశ భవిష్యత్తుకు బలమైన పునాది అని, ప్రతి యువకుడు స్పష్టమైన లక్ష్యంతో ముందుకు సాగి తన ప్రతిభను సమాజ అభివృద్ధికి వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాసులు, ఎంపీడీవో సుబ్రహ్మణ్యం శర్మ, ప్రిన్సిపల్ డాక్టర్ నాగన్న, టీడీపీ నాయకులు లయ జాకీర్‌సింగ్, గుండా చైర్మన్ ముత్తు, జావలి వెంకటేశ్వర్లు, డి.ఉషన్, ప్రజాప్రతినిధులు, అధికారులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు