Shorts కర్నూలు: కర్నూలు జిల్లాకు జీవనాడి అయిన గుండ్రేవుల ప్రాజెక్టును సాధించి తీరుతామని కర్నూలు ప్రగతి సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ఎం.శ్రీహర్ష ఉద్ఘాటించారు. ఆదివారం స్థానిక బిర్లా కాంపౌండ్‌లోని కేపీఎస్ కార్యాలయంలో గుండ్రేవుల ప్రాజెక్టు సాధనకై సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. శ్రీహర్ష మాట్లాడుతూ గుండ్రేవుల ప్రాజెక్టు సాధించే వరకు రాజీ లేకుండా తమ ఉద్యమం కొనసాగుతుందని స్పష్టం చేశారు. కర్నూలు నగరంలో వినాయక విగ్రహాల నిమజ్జనానికి సైతం నీరు లేని పరిస్థితి ఏర్పడిందని, జిల్లాలో నీటి నిల్వకు సరైన ప్రాజెక్టులు లేకపోవడం వల్లే ఇటువంటి పరిస్థితులు తలెత్తుతున్నాయని అన్నారు. జిల్లాలో వ్యవసాయానికి, తాగునీటికి, పారిశ్రామిక అవసరాలకు, నీటి వనరులను సమృద్ధిగా అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. కర్నూలు జిల్లాలో నీటి కొరతను శాశ్వతంగా అధిగమించాలంటే గుండ్రేవుల ప్రాజెక్టును సాధించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. గుండ్రేవుల ప్రాజెక్టు కోసం ప్రజలంతా భాగస్వాములు కావాలని శ్రీహర్ష పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరి సంతకం ఈ ఉద్యమానికి బలాన్ని చేకూరుస్తుందని, ప్రజల ఆకాంక్షను ప్రభుత్వానికి బలంగా తెలియజేసేందుకు పెద్ద ఎత్తున సంతకాలు సేకరించి ప్రభుత్వానికి అందజేస్తామని తెలిపారు. కర్నూలు జిల్లా భవిష్యత్ తరాలకు నీటి భద్రత కల్పించాలంటే గుండ్రేవుల ప్రాజెక్టు ఎంతో కీలకమని, ప్రాజెక్టు సాధన కోసం ప్రజలతో కలిసి నిరంతరం ఉద్యమిస్తామని శ్రీహర్ష స్పష్టం చేశారు