రాయలసీమ: రాయలసీమను రతనాల సీమగా తీర్చిదిద్దే లక్ష్యంతో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలను అమలు చేస్తున్నారు. గ్రామీణాభివృద్ధి, జల సంరక్షణ, రహదారుల నిర్మాణం, తాగునీటి సరఫరా, ఉద్యాన సాగు, పాడి పరిశ్రమ, అటవీ సంరక్షణ, పట్టణ పచ్చదనం వంటి రంగాలకు ప్రాధాన్యత ఇస్తూ పనులను ముందుకు తీసుకెళ్తున్నారు. గడచిన రెండేళ్లలో రాయలసీమలో సుమారు రూ.8,022 కోట్లకు పైగా అభివృద్ధి పనులు చేపట్టడం ద్వారా గ్రామీణ ప్రాంతాల ముఖచిత్రాన్ని మార్చే ప్రయత్నం చేస్తున్నారు. పంచాయతీరాజ్ శాఖ బాధ్యతలు స్వీకరించిన వెంటనే 13,326 పంచాయతీల్లో ఏకకాలంలో గ్రామసభలు నిర్వహించడం ద్వారా గ్రామీణ ప్రజల అవసరాలను తెలుసుకునే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. రైల్వే కోడూరు నియోజకవర్గంలోని మైసూరువారిపల్లి గ్రామాన్ని ఈ కార్యక్రమానికి వేదికగా ఎంచుకున్నారు. ప్రజల భాగస్వామ్యంతో గ్రామాభివృద్ధి ప్రణాళికలను రూపొందించడం, స్థానిక అవసరాలకు అనుగుణంగా పనులు చేపట్టడం లక్ష్యంగా కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. బీటలు వారిన నేలలు, తరచూ ఎదురయ్యే కరువు పరిస్థితులతో ఇబ్బందులు పడే రాయలసీమకు జల సంరక్షణ చర్యలు కీలకంగా మారాయి. ఈ నేపథ్యంలో ఫారం పాండ్లు లేదా పంట కుంటల నిర్మాణానికి ప్రభుత్వం పెద్దపీట వేసింది. కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం పుడిచర్లలో పంట కుంటల నిర్మాణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మొదటి దశలో రాయలసీమలోని ఎనిమిది జిల్లాల్లో 40,837 పంట కుంటలు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకోగా, దానిని అధిగమించి 41,614 వ్యవసాయ చెరువులను నిర్మించారు. ఇందుకోసం రూ.166.46 కోట్లు ఖర్చు చేశారు. రెండో దశలో మరో 29,902 ఫారం పాండ్లు మంజూరు కాగా, వివిధ దశల్లో పనులు కొనసాగుతున్నాయి. రెండు దశల పనుల ఫలితంగా రాయలసీమలో 50 వేల ఎకరాలకు పైగా అదనపు సాగు విస్తీర్ణం అందుబాటులోకి వచ్చినట్లు ప్రభుత్వం పేర్కొంటోంది. వ్యవసాయంతో పాటు పాడి పరిశ్రమను గ్రామీణ కుటుంబాలకు అదనపు ఆదాయ వనరుగా మార్చే దిశగా మినీ గోకులాల నిర్మాణాన్ని చేపట్టారు. రాయలసీమ వ్యాప్తంగా గత రెండేళ్లలో సుమారు 15 వేల మినీ గోకులాలు నిర్మించారు. మరో మూడు వేల గోకులాలు వివిధ దశల్లో ఉన్నాయి. మొదటి దశలోనే 9,708 మినీ గోకులాలను నిర్మించి రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చారు. పల్లెపండుగ, పల్లెపండుగ 2.0 కార్యక్రమాల కింద వ్యక్తిగత పశువుల షెడ్ల నిర్మాణానికి రూ.170 కోట్లకు పైగా వ్యయం చేశారు. పశువులకు రక్షణతో పాటు నీటి తొట్టెలు, ఇతర మౌలిక సదుపాయాలను కల్పించడం ద్వారా పాడి రైతుల జీవనోపాధిని బలోపేతం చేయడంపై దృష్టి పెట్టారు. రాయలసీమను ఉద్యాన పంటల హబ్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులను వినియోగిస్తున్నారు. పండ్ల తోటలు, పూలు, మునగ వంటి ఉద్యాన పంటల సాగుకు రైతులకు సహకారం అందిస్తున్నారు. రెండు దశల్లో సుమారు 62 వేల ఎకరాల్లో ఉద్యాన పంటల సాగు చేపట్టేందుకు రూ.200 కోట్లకు పైగా ఖర్చు చేశారు. ఈ కార్యక్రమం ద్వారా 28 వేల మందికి పైగా రైతులు లబ్ధి పొందినట్లు అధికారులు చెబుతున్నారు. ఎకరాకు ఏటా రూ.80 వేల నుంచి రూ.లక్ష వరకు ఆదాయం పొందే అవకాశం ఉండటంతో చిన్న, సన్నకారు రైతులకు ఈ కార్యక్రమం జ