పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి రూ.700 కోట్ల నిధులు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి గద్వాల, ఆంధ్రప్రభ: ఆధ్యాత్మికంగా ఎంతో విశిష్టత కలిగిన ఆలంపూర్ ఆలయాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ప్రసాద్ పథకం కింద ఇప్పటికే పలు అభివృద్ధి పనులు చేపట్టామని, భవిష్యత్తులో కూడా ఈ క్షేత్రాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని అన్నారు. ఆలంపూర్ ఆలయాల వద్ద ఏర్పాటు చేసిన మల్టీమీడియా, సౌండ్ అండ్ లైట్ ప్రదర్శనను ఆదివారం సాయంత్రం ఇతర అతిథులతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఆలంపూర్ ఆలయాలను పెద్ద సంఖ్యలో భక్తులు సందర్శిస్తుంటారని అన్నారు. ఆలయ చరిత్ర, విశిష్టతలను భక్తులకు చేరువ చేసేందుకు ప్రతి రోజు సాయంత్రం 25 నిమిషాల పాటు ప్రత్యేక ప్రదర్శనలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా ఆలయ ప్రాధాన్యం మరింత విస్తృతంగా ప్రజలకు చేరుతుందని, ఆధ్యాత్మిక పర్యాటకానికి కూడా ఊతం లభిస్తుందని పేర్కొన్నారు. తాను కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా ఉన్న సమయంలో తెలంగాణలోని సుమారు 15 పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి రూ.700 కోట్ల నిధులు కేటాయించినట్లు కిషన్ రెడ్డి తెలిపారు. రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు లభించేందుకు కేంద్ర ప్రభుత్వం ఎంతో కృషి చేసిందని గుర్తు చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని అనేక దర్శనీయ, ఆధ్యాత్మిక ప్రాంతాల అభివృద్ధికి కేంద్రం పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తోందని చెప్పారు. గోల్కొండ కోట, ఉస్మానియా ఆర్ట్స్ కళాశాల వద్ద సౌండ్ అండ్ లైట్ ప్రదర్శనలు ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. జోగులాంబ రైల్వే స్టేషన్‌ను అమృత్ పథకం కింద అభివృద్ధి చేశామని పేర్కొన్నారు. ఆలంపూర్ క్షేత్రాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు స్థానిక ప్రజలు, భక్తులు తమ సలహాలు ఇవ్వాలని కోరారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని పలు ఆధ్యాత్మిక ప్రాంతాల అభివృద్ధికి కూడా కేంద్రం కట్టుబడి ఉందన్నారు. మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ మాట్లాడుతూ ఆలంపూర్ ఆలయానికి వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో ప్రసాద్ పథకం కింద పలు అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. అన్నదాన భవనం, విశ్రాంతి గదులు, ఆహార కేంద్రం, సాంస్కృతిక ప్రదర్శనశాల వంటి సదుపాయాలతో పాటు తుంగభద్ర నదిలో పడవ విహార సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అమృత్ పథకం కింద జోగులాంబతో పాటు గద్వాల రైల్వే స్టేషన్ల ఆధునికీకరణ పనులు వేగంగా సాగుతున్నాయని డీకే అరుణ తెలిపారు. రవాణా సౌకర్యాలు మెరుగుపడితే ఆలంపూర్‌తో పాటు జిల్లాలోని పర్యాటక, ఆధ్యాత్మిక ప్రాంతాలకు మరింత ప్రాధాన్యం పెరుగుతుందని పేర్కొన్నారు. నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లు రవి మాట్లాడుతూ ఆలంపూర్ ఆలయాల చరిత్ర, విశిష్టతలను తెలియజేసే మల్టీమీడియా సౌండ్ అండ్ లైట్ ప్రదర్శనతో ఆలయ పర్యాటకం మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఆలంపూర్ క్షేత్ర అభివృద్ధికి అవసరమైన సహకారం కోసం కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడతామని తెలిపారు. డోర్నకల్ నుంచి గద్వాల వరకు రైల్వే మార్గం ఏర్పాటుకు కూడా కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు