వినాయక ఘాట్‌ను వచ్చే ఏడాదికల్లా పూర్తి చేస్తా: ఎమ్మెల్యే గిత్త జయసూర్య నందికొట్కూరు, ఆంధ్రప్రభ : నందికొట్కూరు పట్టణ నిమజ్జనోత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఎమ్మెల్యే గిత్త జయసూర్య మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు చేపడుతోందని, ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్ ఇవ్వడంతో పాటు డీజేలకు అనుమతులు ఇచ్చి భక్తుల ఉత్సాహానికి అండగా నిలిచిందని అన్నారు. ఇది కూటమి ప్రభుత్వ ఘనత అని పేర్కొన్నారు. గత పాలకులు నందికొట్కూరు పట్టణాన్ని పట్టించుకున్న నాథుడే లేడని, అభివృద్ధిని పూర్తిగా విస్మరించారని విమర్శించారు. వినాయక నిమజ్జనం సందర్భంగా భక్తులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని జూపాడు బంగ్లాలో వినాయక నిమజ్జన ఘాట్‌ను వచ్చే ఏడాదికల్లా పూర్తి చేసి అందుబాటులోకి తెస్తానని ఎమ్మెల్యే గిత్త జయసూర్య హామీ ఇచ్చారు. 2024 ఎన్నికల్లో స్థానికుడిగా తనను గెలిపించిన నందికొట్కూరు పట్టణ ప్రజల రుణాన్ని తప్పకుండా తీర్చుకుంటానని అన్నారు. నందికొట్కూరు పట్టణాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసి తీరుతానని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే ప్రసంగానికి భక్తులు, యువత పెద్ద ఎత్తున చప్పట్లు కొడుతూ జయజయధ్వానాలు చేశారు