Kaizer News

6 Of Family Die In Fire | బకెట్‌తో ఒక ఇంట్లోకి ప్ర

6 Of Family Die In Fire | బకెట్‌తో ఒక ఇంట్లోకి ప్రవేశించిన వ్యక్తి.. అగ్నిప్రమాదంలో ఆరుగురు మృతి

· National - India · ntnews.com

బెంగళూరు: ఒక వ్యక్తి తన చేతిలోని బకెట్‌తో ఒక ఇంట్లోకి ప్రవేశించాడు. రెండు నిమిషాల తర్వాత ఖాళీ చేతులతో అక్కడి నుంచి వెళ్లాడు. ఆ వెంటనే ఆ ఇంట్లో అగ్నిప్రమాదం జరిగింది. ఇంట్లో నిద్రిస్తున్న ఆరుగురు వ్యక్తులు సజీవ దహనమయ్యారు. తొలుత షార్ట్ సర్క్యూట్ లేదా రిఫ్రిజిరేటర్ పేలుడు అగ్నిప్రమాదానికి కారణంగా పోలీసులు భావించారు. (6 Of Family Die In Fire) అయితే ఒక వ్యక్తి బకెట్‌తో ఆ ఇంట్లోకి వెళ్లడాన్ని సీసీటీవీ ఫుటేజ్‌లో గుర్తించడంతో అతడిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కర్ణాటకలోని బెళగావిలో ఈ సంఘటన జరిగింది. సెప్టెంబర్ 15న తెల్లవారుజామున 2 గంటల సమయంలో చావత్ వీధిలోని ఒక ఇంట్లో అగ్నిప్రమాదం సంభవించింది. గజానన్ డమోన్‌తో సహా ఆ కుటుంబానికి చెందిన ఆరుగురు వ్యక్తులు మంటల్లో కాలి సజీవ దహనమయ్యారు. కాగా, ఈ అగ్నిప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. షార్ట్ సర్క్యూట్ లేదా రిఫ్రిజిరేటర్ పేలుడు వల్ల అగ్నిప్రమాదం జరిగినట్లు తొలుత భావించారు. అయితే ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. సెప్టెంబర్‌ 15న తెల్లవారుజామున 1.58 గంటలకు ఒక వ్యక్తి బకెట్ పట్టుకుని ఆ ఇంటి సమీపానికి వెళ్లాడు. రెండు నిమిషాల తర్వాత చేతిలో బకెట్‌ లేకుండా ఆ ప్రాంతం నుంచి అతడు తిరిగి వెళ్లినట్లు సీసీటీవీ ఫుటేజ్‌లో కనిపించింది. మరోవైపు ఆ వ్యక్తి అక్కడి నుంచి వెళ్లిన కొద్దిసేపటికే ఆ ఇంట్లో అగ్నిప్రమాదం సంభవించి మంటలు చెలరేగడంతో ఆరుగురు మరణించారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆ వ్యక్తిపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ రెండు నిమిషాల్లో అక్కడ ఏం జరిగింది? ఆ ఇంట్లో అగ్నిప్రమాదం జరుగడానికి ఆ వ్యక్తికి ఏమైనా సంబంధం ఉన్నదా? అన్నది దర్యాప్తు చేస్తున్నారు. ఆ గుర్తుతెలియని వ్యక్తి ఎవరు? అగ్నిప్రమాదంలో మరణించిన ఆ కుటుంబ సభ్యులకు, అతడికి ఏమైనా సంబంధం ఉన్నదా? అన్నది ఆరా తీస్తున్నారు. ఆ వ్యక్తిని గుర్తించి అతడి ఆచూకీ తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు

Original source: ntnews.com
Read more on Kaizer News