Kaizer News

హోర్డింగ్ పనుల్లో భద్రతా ప్రమాణాలేవీ?

హోర్డింగ్ పనుల్లో భద్రతా ప్రమాణాలేవీ?

· State - Telangana · prabhanews.com

రక్షణ పరికరాలు లేకుండానే మున్సిపల్ సిబ్బందితో పనులు.. ఏదైనా ప్రమాదం జరిగితే బాధ్యులు ఎవరు? మున్సిపల్ అధికారులను ప్రశ్నిస్తున్న పట్టణ ప్రజలు మెట్‌పల్లి, ఆంధ్రప్రభ: మెట్‌పల్లి పట్టణంలోని న్యూ బస్టాండ్ ఎదుట ఏర్పాటు చేసిన భారీ హోర్డింగ్ బోర్డు పనులు ప్రస్తుతం మున్సిపల్ సిబ్బందితో కొనసాగుతున్నాయి. అయితే, ఎత్తైన ప్రదేశంలో పనులు చేస్తున్న సిబ్బందికి కనీస భద్రతా చర్యలు లేకపోవడంపై పట్టణ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హోర్డింగ్‌ ఇనుప నిర్మాణంపై సిబ్బంది ఎలాంటి సేఫ్టీ బెల్టులు, సేఫ్టీ హెల్మెట్లు, ఇతర రక్షణ పరికరాలు లేకుండానే పని చేస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయని ప్రజలు పేర్కొంటున్నారు. ఎత్తైన ప్రదేశాల్లో పని చేసే సమయంలో ముందస్తు భద్రతా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత అధికారులపై ఉందని వారు అంటున్నారు. సిబ్బంది ప్రాణాలను పణంగా పెట్టి పనులు చేయించడం సమంజసమేనా అని ప్రశ్నిస్తున్నారు. విధి నిర్వహణలోని సిబ్బంది భద్రతకు అవసరమైన రక్షణ పరికరాలు అందించి, వాటిని వినియోగించిన తర్వాతే పనులు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఎత్తైన హోర్డింగ్‌లపై పనులు జరుగుతున్న సమయంలో కింద ప్రజల రాకపోకలు కూడా ఉంటాయని, చిన్నపాటి నిర్లక్ష్యం పెద్ద ప్రమాదానికి దారితీసే అవకాశం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సిబ్బంది భద్రతతో పాటు ప్రజల భద్రతను కూడా దృష్టిలో పెట్టుకుని మున్సిపల్ అధికారులు తక్షణమే స్పందించి, భద్రతా ప్రమాణాలు పాటించేలా చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు

Original source: prabhanews.com
Read more on Kaizer News