Kaizer News

రెండేళ్ల కూటమి పాలనపై ప్రజలు సంతోషం

రెండేళ్ల కూటమి పాలనపై ప్రజలు సంతోషం

· State - Telangana · prabhanews.com

అభివృద్ధి, సంక్షేమానికి సమ ప్రాధాన్యం: ఎమ్మెల్యే అమిలినేని అనంతపురము, ఆంధ్రప్రభ : రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ రెండేళ్లలో కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమానికి సమ ప్రాధాన్యం ఇస్తూ రాష్ట్రాన్ని గాడిన పెడుతోందని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు అన్నారు. అన్ని వర్గాలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని, ప్రజల వద్దకు వెళ్లి అడిగితే రెండేళ్ల పాలనపై సంతోషం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. కుందుర్పి మండలం తెనగల్లు గ్రామంలో రెండేళ్ల కూటమి ప్రభుత్వ పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించేందుకు శనివారం నిర్వహించిన ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. గ్రామానికి చేరుకున్న ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు, పార్టీ పరిశీలకుడు, రాష్ట్ర వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ రామకృష్ణ, టీడీపీ నాయకులకు మండల పార్టీ నాయకులు, గ్రామస్థులు గజమాలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం మహర్షి వాల్మీకి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి, పార్టీ జెండాను ఎగురవేశారు. ఆ తర్వాత నాయకులతో కలిసి ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుసుకుని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రెండేళ్లలో ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ కరపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం సంక్షేమం పేరుతో అప్పులు చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఒకవైపు అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతూనే మరోవైపు సంక్షేమ పథకాలను ఎక్కడా నిలిపివేయకుండా కొనసాగిస్తోందని తెలిపారు. రాష్ట్రాన్ని దేశంలోనే ఆదర్శంగా నిలిపేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఒక్క గ్రామంలో కూడా సీసీ రోడ్లు వేయలేదని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తెనగల్లు గ్రామంలోని ప్రధాన రహదారిని రూ.కోటి వ్యయంతో సీసీ రోడ్డుగా నిర్మించామని తెలిపారు. గ్రామంలోని కాలనీల్లో కూడా సీసీ రోడ్ల నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చారు. వీరశైవ లింగాయత్‌ల విజ్ఞప్తి మేరకు యల్లమ్మ ఆలయ అభివృద్ధికి తన సొంత నిధుల నుంచి రూ.50 వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. గ్రామంలో ఉన్న మహర్షి వాల్మీకి విగ్రహానికి పైకప్పు నిర్మాణం కోసం తనవంతుగా రూ.లక్ష విరాళంగా అందిస్తానని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు హామీ ఇచ్చారు. ప్రజల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు పాల్గొన్నారు

Original source: prabhanews.com
Read more on Kaizer News