హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో భూపరిపాలన వ్యవస్థ అత్యంత క్లిష్టమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది. క్షేత్రస్థాయి రెవెన్యూ చట్టాలు, రికార్డులపై సరైన పట్టు లేకపోవడంతో పలువురు యువ ఐఏఎస్ అధికారులు జిల్లాల్లో భూ సమస్యలను పరిష్కరించలేక తీవ్ర గందరగోళానికి గురవుతున్నారనే టాక్ నడుస్తోంది. ముఖ్యంగా ఇటీవల వివాదానికి దారితీసిన రిజిస్ట్రేషన్ చట్టంలోని సెక్షన్ 22(ఏ) కింద నిషేధిత ఆస్తుల జాబితాలో అర్హులైన రైతుల పట్టా భూములు, ప్రైవేటు ఆస్తులు ఎలా చేరుతున్నాయో కూడా గుర్తించలేని స్థితిలో కొందరు కలెక్టర్లు ఉండటం పాలనాపరమైన లోపాలను ఎత్తిచూపుతోంది. సామాన్యుల భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించే అంశంలో సరైన నిర్ణయాలు తీసుకోలేక, పాత రికార్డులను శోధించలేక ఉన్నతాధికారులపై ఆధారపడుతున్న తీరు చర్చనీయాంశంగా మారింది. ఇనామ్, భూదాన్, టెనెన్సీ, యూఎల్‌సీ వంటి భూ చట్టాల లోతులు తెలియకపోవడంతో కిందిస్థాయి సిబ్బంది ఇచ్చే నివేదికలకే ఆమోదముద్ర వేస్తూ మమ అనిపిస్తున్నట్లు తెలిసింది. క్షేత్రస్థాయి అనుభవం లేని నిర్ణయాలతో వేలాది ఎకరాల ప్రైవేటు భూములు లాక్ అయిపోయి, భూ సమస్యలతో సామాన్య ప్రజలు ఏళ్ల తరబడి కలెక్టరేట్ల చుట్టూ కాళ్లరిగేలా తిరగాల్సిన దుస్థితి దాపురించింది. రిజిస్ట్రేషన్ చట్టం సెక్షన్ 22(ఏ)లోని వివిధ సబ్ కేటగిరీలపై అవగాహనలోపమే ఇప్పుడు భూ యజమానులకు శాపంగా మారింది. ప్రభుత్వ, దేవాదాయ, అసైన్డ్ ఆస్తుల అక్రమ రిజిస్ట్రేషన్లకు అడ్డుకట్ట వేసే లక్ష్యంతో ఉమ్మడి ఏపీ ప్రభుత్వం తొలిసారిగా1999లో రిజిస్ట్రేషన్ల చట్టం-1908కి సవరణ చేస్తూ ‘సెక్షన్ 22(ఏ)’ను ప్రవేశపెట్టగా.. ఆ నిబంధనల్లో స్పష్టమైన విధివిధానాలు లేకపోవడంతో హైకోర్టు దానిని కొట్టివేసింది. ఈ న్యాయపరమైన చిక్కులను అధిగమించేందుకు ఉమ్మడి ఏపీలో అప్పటి ప్రభుత్వం 2007లో ‘యాక్ట్ నంబర్ 19/2007’ ద్వారా సమగ్ర చట్ట సవరణ తీసుకొచ్చింది. అదే ఏడాది జూన్ 20 నుంచి పూర్తిస్థాయిలో అమల్లోకి తెచ్చింది. ఈ 2007 సవరణ ద్వారానే నిషేధిత భూములను 5 స్పష్టమైన ఉప-విభాగాలుగా చేసింది. అందులో భాగంగానే ఐదు నెలల కింద మార్పులు చేసి ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేయగా క్షేత్రస్థాయిలో అనేక సమస్యలు తలెత్తాయి. వాస్తవానికి 22-ఏ(1)(ఏ) కింద ప్రభుత్వ, అసైన్డ్, పోరంబోకు, డీ-ఫామ్ పట్టా భూములుంటాయి. 22-ఏ(1)(బీ) కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన ఆస్తులు, ప్రభుత్వ రంగ సంస్థల స్థలాలు ఉంటాయి. 22-ఏ(1)(సీ) కేటగిరీలో దేవాదాయ, ధర్మాదాయ, వక్ఫ్ బోర్డుకు చెందిన మాన్యాలు ఉంటాయి. 22-ఏ(1)(డీ) కింద భూపరిమితి చట్టం(సీలింగ్) మిగులు భూములు, భూదాన్ యజ్ఞ బోర్డు స్థలాలు, టైటిల్ వివాదాలు తేలని ఈనాం భూములు ఉంటాయి. ఇక 22-ఏ(1)(ఈ) కింద కోర్టులు అటాచ్ చేసిన ఆస్తులు, సీబీఐ, ఈడీ, అవినీతి నిరోధక శాఖల కేసుల్లో ఉన్న భూములు నమోదవుతాయి. ఈ కేటగిరీల మధ్య ఉన్న లీగల్ వ్యత్యాసాన్ని సరిగ్గా అంచనా వేయలేక, ప్రైవేటు పట్టా భూములను యథాలాపంగా నిషేధిత జాబితాలో చేర్చేస్తున్నారు. ఏ కేటగిరీ నుంచి ఏ ఆధారాలతో భూమిని డీ-నోటిఫై చేయాలో కలెక్టర్లకు తెలియకపోవడంతో వేలాది ఎకరాల వివాదాలు ఏళ్ల తరబడి ఎటూ తేలకుండా కోల్డ్ స్టోరేజీలోకి వెళ్లిపోతున్నాయి. క్షేత్రస్థాయి అవగ