రోడ్డు లేని చిన్న పల్లెలో పుట్టాడు. పేదరికంలో పెరిగాడు. పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగంలో పరుగు నేర్చాడు. ఫిట్‌నెస్ కోసం పరిగెత్తుతూ ఓ రోజు హైదరాబాద్ మారథాన్‌లో అడుగుపెట్టాడు. తన వేగం, సామర్థ్యం ఏమిటో అప్పుడు తెలుసుకున్నాడు! ఇక చిరుతలా పరిగెత్తుతూనే ఉన్నాడు. దేశంలో జరిగే మారథాన్‌లు, అల్ట్రా రన్ చాలెంజ్‌లలో గెలిచాడు. ప్రపంచంలోనే అత్యంత క్లిష్టమైన లద్దాఖ్‌లో అల్ట్రా రన్ చాలెంజ్‌లు స్వీకరించాడు. మంచు కొండల్లో తన సత్తా చాటాడు. హిమాలయాలపై తెలంగాణ పోలీస్ జెండా పాతిన కానిస్టేబుల్ పిల్లి రాజు ‘జిందగీ’తో పంచుకున్న విశేషాలు ఆయన మాటల్లోనే.. మా ఊరు కొష్టాల (వైరా మండలం, ఖమ్మం జిల్లా) చిన్న గ్రామం. సరైన రోడ్డు లేని ఊరది. నాన్న ప్రభుదాస్ కిరోసిన్ రేషన్ డీలర్. నేను ఏడో తరగతి చదువుతున్నప్పుడు నాన్న చనిపోయాడు. మా అమ్మ మరియమ్మ ఆ డీలర్‌షిప్ తీసుకుని కిరోసిన్ అమ్ముతూ… ఇల్లు నడిపింది. పేదరికంలోనూ.. అమ్మ మా చదువుని ఆపలేదు. మా పక్క ఊరు తాటిపుడిలో ఉన్న జిల్లా పరిషత్ పాఠశాలలో చదివాను. చిన్నప్పటి నుంచి ఆటలంటే ఇష్టం. కబడ్డీ బాగా ఆడేవాడిని. ఏడో తరగతిలో ఉన్నప్పుడు జిల్లా స్థాయి స్కూల్ గేమ్స్‌లో ఆడాను. తొమ్మిదో తరగతిలో రాష్ట్ర స్థాయిలో ఆడాను. నా ప్రతిభ చూసి శాప్ నన్ను ఎంపిక చేసుకుంది. మూడు నెలలపాటు ప్రత్యేక శిక్షణ ఇచ్చింది. తర్వాత రాష్ట్ర జట్టుకి ఎంపికయ్యాను. జాతీయ స్థాయి పాఠశాలల క్రీడల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాను. ఇంటర్మీడియెట్ చదివేటప్పుడు కాలేజ్ గేమ్స్‌లో ఖమ్మం జిల్లా జట్టులో రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొన్నాను. మాకు మూడో స్థానం వచ్చింది. రాష్ట్ర స్థాయి ఇంటర్ యూనివర్సిటీ గేమ్స్‌లో కేయూ జట్టు తరఫున ఆడాను. అందులో రన్నరప్‌గా నిలిచాం. ఉస్మానియా నా ధైర్యం చిన్నప్పటి నుంచి ఒంటరితనం నన్ను భయపెట్టేది. ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ తెలుగులో చేరాక అది పోయింది. ఉస్మానియా క్యాంపస్‌లో అడుగుపెట్టాక ప్రపంచం అర్థమైంది. నలుగురిలో కలిసిపోయాను. సీనియర్స్ మాటలు, లైబ్రరీ చదువులు నాకు బాగా నచ్చేవి. అక్కడే ఈ ప్రపంచాన్ని చదివాను. క్యాంపస్‌లో ఉన్న రోజుల్లో నాకు ఆత్మవిశ్వాసం పెరిగింది. నాకు లెక్చరర్ కావాలని కోరిక. అందరూ చేస్తున్నారని పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగానికి దరఖాస్తు చేశాను. మొదటి ఏడాదిలో కానిస్టేబుల్‌గా ఎంపికయ్యాను. ఏదో ఒక ఉద్యోగం వచ్చిందని, వదులుకోవద్దని అందరూ అంటే చేరాను. ఉద్యోగంలో చేరినా ఎంఏ పూర్తి చేశాను. తెలుగు విశ్వవిద్యాలయంలో ఎంఫిల్ పూర్తిచేశాను. ఓసారి జేఎల్ రాశాను. తెలంగాణలో ఒకే పోస్ట్ ఉంది. ఒక్క మార్కుతో అది మరొకరికి దక్కింది. ఇంకో ప్రయత్నం చేయలేదు. కానిస్టేబుల్‌గానే ఉండిపోయాను. హైదరాబాద్ టు ఆల్ ఇండియా ఖమ్మంలో రిజర్వ్ పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం చేస్తున్నా. రోజూ ఉదయం గ్రౌండ్‌కి వెళ్లేవాణ్ని. రన్నింగ్, స్విమ్మింగ్, సైక్లింగ్ చేసేది. ఇన్‌స్పెక్టర్ తిరుపతి రెడ్డి గారు మాతోపాటు రన్నింగ్ చేసేవారు. ఆయన మమ్మల్ని పది, పదిహేను, ఇరవై కిలోమీటర్లు పరిగెత్తించేవారు. ఓ రోజు.. హైదరాబాద్ మారథాన్ ఉందని, నువ్వు రావాలని తీసుకెళ్లారు. రెండు గంటల పది న