మంచిర్యాల, ఆంధ్రప్రభ: జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న ఖదీం కబ్రస్థాన్ పరిసర ప్రాంతాన్ని శుభ్రపరిచి, అవసరమైన మౌలిక వసతులు కల్పించి వినియోగంలోకి తీసుకురావాలని ఏఐఎంఐఎం నాయకులు మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌ను కోరారు. ఈ మేరకు శనివారం కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సయ్యద్ ఇబ్ని ఆఫాన్ మాట్లాడుతూ.. కబ్రస్థాన్ ప్రాంతంలో పిచ్చి మొక్కలు విపరీతంగా పెరిగి అటవీ ప్రాంతాన్ని తలపించేలా మారిందన్నారు. దీంతో మైనార్టీ కుటుంబాలకు చెందిన మృతదేహాలను ఖననం చేసేందుకు తీసుకువచ్చే కుటుంబ సభ్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. అదేవిధంగా కబ్రస్థాన్ పరిసర ప్రాంతాల్లో నివసించే ప్రజలు విషపూరిత జంతువుల సంచారంతో భయాందోళనకు గురవుతున్నారని పేర్కొన్నారు. ఈ ప్రాంత అభివృద్ధికి నిధులు మంజూరు చేసి ప్రహరీ గోడ నిర్మాణం, సెంట్రల్ లైటింగ్, తాగునీటి సౌకర్యంతో పాటు ఇతర మౌలిక వసతులు కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐఎంఐఎం మంచిర్యాల పట్టణ అధ్యక్షుడు మొహమ్మద్ సాహిర్, మాజీ కౌన్సిలర్ సయ్యద్ హబీబ్, సమీర్ మహమ్మద్ తదితరులు పాల్గొన్నారు