Shorts సిరిసిల్ల: నియోజకవర్గంలోని మూడు మండలాలకు చెందిన వివిధ గ్రామాల నుంచి సుమారు 200 మంది తెలంగాణ రక్షణ సేన పార్టీలో చేరినట్లు పార్టీ నాయకులు తెలిపారు. ఎల్లారెడ్డిపేట మండలంలోని బొప్పాపూర్ గ్రామంలో శుక్రవారం సాయంత్రం ఈ చేరికల కార్యక్రమం నిర్వహించారు. ఎల్లారెడ్డిపేట మండలం నుంచి మహిళా సీనియర్ నాయకురాలు బొమ్మన వేణి పరుశరాములు, కదిరే రేణుక, కదిరే భాస్కర్ గౌడ్ ఆధ్వర్యంలో, వీర్నపల్లి మండలం నుంచి సీనియర్ నాయకులు బండి శ్రీహరి, మండేపల్లి రవి ముదిరాజ్ ఆధ్వర్యంలో, గంభీరావుపేట మండలం నుంచి బందెల రాజు ఆధ్వర్యంలో, పలు గ్రామాల నుంచి యువ నాయకుడు సయ్యద్ జావిద్ ఆధ్వర్యంలో పలువురు కార్యకర్తలు పార్టీలో చేరారు. పార్టీలో చేరేందుకు వచ్చిన వారికి సిరిసిల్ల నియోజకవర్గ ఇన్‌చార్జ్ మజీద్ పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 20న కొడంగల్‌లో కవితక్క ఆధ్వర్యంలో పాంచజన్య సంకల్ప సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. సభకు అందరూ స్వచ్ఛందంగా తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రక్షణ సేన పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పనిచేస్తున్నారని మజీద్ పేర్కొన్నారు. ఉద్యమకారులు, సింగరేణి కార్మికులు, ఆటో కార్మికులు, నిరుద్యోగుల సమస్యలతో పాటు నేరెళ్ల బాధితులకు న్యాయం, పోలీసు ఉద్యోగాల పెంపు తదితర అంశాలపై ఉద్యమాలు నిర్వహించినట్లు తెలిపారు. కవిత ప్రతిపాదిస్తున్న పాంచజన్య పథకాలు, ఉచిత విద్య, ఉచిత వైద్యం, రైతు సంక్షేమం, ఉపాధి అవకాశాలు, సామాజిక న్యాయం వంటి అంశాలకు ఆకర్షితులై ప్రజలు పార్టీలో చేరుతున్నారని మజీద్ అన్నారు. మహిళలు, యువత పెద్ద సంఖ్యలో రాజకీయాల్లోకి రావాలని, పార్టీ ఆశయాలను ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. 2029లో తెలంగాణకు కల్వకుంట్ల కవితను ముఖ్యమంత్రిని చేయడమే తమ లక్ష్యమని మజీద్ పేర్కొన్నారు. సామాజిక న్యాయం, సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా తెలంగాణ రక్షణ సేనను మరింత బలోపేతం చేయాలని కార్యకర్తలకు సూచించారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు బైరి రాజేష్, మల్లవ్వ, లాస్య, లచ్చవ్వ, బొమ్మన వేణి పద్మ, పుష్పలత, ఎల్లవ్వ, మంజుల, పూజిత, అల్లే సత్తవ్వ, నర్సయ్య, అనసూయ, గంగారాణి, బుధవ్వ, నిమ్మల లావణ్య, మాధవి, అఖిల, తమ్మినవేని మల్లయ్య, ఈశ్వరవ్వ, శిరీష, దుర్గమ్మ, జ్యోతి, ముస్తాబాద్ మండల నాయకులు మార్వాడి దేవరాజు తదితరులు పాల్గొన్నారు