సౌదీ అరేబియా రాజధాని రియాద్ లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. రియాద్‌లోని కింగ్ ఖాలిద్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలోని ఇంధన నిల్వ ప్రాంతంలో భారీగా మంటలు చెలరేగాయి. దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. ఈ ఘటనకు ముందు నగరంలో పేలుళ్ల శబ్దాలు వినిపించడంతో సౌదీ అధికారులు వైమానిక దాడుల ముప్పుపై ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. ఘటన జరిగిన కొన్ని గంటల తర్వాత యెమెన్‌కు చెందిన హౌతీ గ్రూప్ కీలక ప్రకటన చేసింది. రియాద్‌లోని సున్నిత ప్రాంతాలు, అలాగే రియాద్ విమానాశ్రయం సమీపంలోని ఇంధన నిల్వ కేంద్రంలో సౌదీ చమురు సంస్థ ఆరామ్‌కోకు చెందిన ఇక ఇంధన ట్యాంక్‌లను లక్ష్యంగా చేసుకుని రెండు సైనిక ఆపరేషన్లు నిర్వహించినట్లు హౌతీ సైనిక ప్రతినిధి యాహ్యా సరీ తెలిపారు. తమ దాడుల్లో పెద్ద సంఖ్యలో బ్యాలిస్టిక్ మిసైళ్లు, క్రూయిజ్ మిసైళ్లు, డ్రోన్లను ఉపయోగించినట్లు హౌతీలు పేర్కొన్నారు. యెమెన్ రాజధాని సనాపై సౌదీ అరేబియా దాడులకు ప్రతిస్పందనగానే ఈ చర్యలు చేపట్టినట్లు వారు తెలిపారు. రియాద్ విమానాశ్రయం సమీపంలో అరామ్‌కో లోగో ఉన్న ఇంధన ట్యాంక్‌లో మంటలు చెలరేగడంతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చినట్లు సమాచారం. ఈ ఘటనతో కొంతసేపు విమానాశ్రయ కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడినట్లు స్థానిక అధికారులు తెలిపారు. కొద్దిసేపటి తరువాత విమాన రాకపోకలు సాధారణ స్థితికి చేరుకున్నాయి. దాడుల ముప్పు నేపథ్యంలో రియాద్, అల్-ఖర్జ్ ప్రాంతాల్లో ప్రజలకు సౌదీ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సౌదీ సంకీర్ణ దళాల ప్రతినిధి తుర్కీ అల్ -మాలిక్ తెలిపిన వివరాల ప్రకారం.. తెల్లవారుజామున హౌతీలు రియాద్ నగరాన్ని లక్ష్యంగా చేసుకొని బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించినట్లు తెలిపారు. సౌదీ వైమానిక రక్షణ వ్యవస్థలు విజయవంతంగా దానిని అడ్డుకొని ధ్వంసం చేశాయని, బిషా, తాయిఫ్, ఫరాసాన్, యన్బు ప్రాంతాల్లోని పౌరులతో పాటు వసతులను కూడా లక్ష్యంగా చేసుకునేందుకు హౌతీలు ప్రయత్నించారని, ఆ దాడులను కూడా అడ్డుకున్నామని తెలిపారు