ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ: విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన ఆది పరాశక్తి శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి సన్నిధిలో సంకష్టహర చతుర్థి పర్వదినాన్ని పురస్కరించుకుని సోమవారం గణపతి హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. దేవస్థాన యాగశాలలో ఆలయ అర్చకులు గణపతికి ప్రత్యేక పూజలు, అభిషేకం నిర్వహించిన అనంతరం గణపతి హోమాన్ని వైభవంగా చేపట్టారు. పురాణాల ప్రకారం గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన తిథుల్లో సంకష్టహర చతుర్థి ప్రధానమైనదిగా భావిస్తారు. ఈ రోజున విఘ్నేశ్వరుడిని భక్తిశ్రద్ధలతో పూజించడం వల్ల జీవితంలోని సంకటాలు, విఘ్నాలు తొలగి కార్యసిద్ధి కలుగుతుందని పురాణోక్తి. ఈ విశ్వాసంతో అమ్మవారి సన్నిధిలో నిర్వహించిన గణపతి హోమంలో అర్చకులు ప్రత్యేక సంకల్పంతో పూజలు చేశారు. వేద మంత్రోచ్ఛారణల మధ్య గణపతి హోమాన్ని నిర్వహించి సర్వలోక శాంతి, ప్రజల సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, క్షేమం కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. సంకష్టహర చతుర్థి సందర్భంగా ఇంద్రకీలాద్రిపై ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. భక్తులు గణపతిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు