ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: ఒక సినిమా అంటే కేవలం రెండున్నర గంటల వినోదం మాత్రమే కాదు.. తరతరాల చరిత్రకు, సమాజ ప్రతిబింబానికి సజీవ రూపం. అటువంటి అత్యున్నత ప్రతిభను, కాలాన్ని జయించిన కథనాలను గౌరవిస్తూ ఏడు దశాబ్దాలుగా కొనసాగుతున్న ‘జాతీయ చలనచిత్ర పురస్కారాల’ ప్రస్థానంలో ఈసారి ఒక చారిత్రాత్మక అధ్యాయం మొదలుకాబోతోంది. 1954లో కేవలం ఏడు విభాగాలతో మొదలై ‘శ్యామ్‌చి ఆయి’, ‘దో బీఘా జమీన్’ వంటి క్లాసిక్స్‌ను గౌరవించిన ఈ పురస్కారాలు.. నేడు నటీనటులు, సాంకేతిక నిపుణులు, డాక్యుమెంటరీలు, యానిమేషన్ వరకు ప్రతి రంగానికి అత్యున్నత వేదికగా మారాయి. మరాఠీ, తమిళం, మలయాళం, తెలుగు, కన్నడ నుంచి తుళు, గర్హ్వాలీ వరకు భారతీయ సంస్కృతిలోని ప్రతి భాషా స్వరాన్ని ఈ వేదిక ఏకతాటిపైకి తీసుకొచ్చింది. ఇన్నాళ్లూ దేశ రాజధాని ఢిల్లీ వేదికగా మాత్రమే వైభవంగా జరిగిన ఈ అవార్డుల ప్రదానోత్సవం, ఈసారి తన సరిహద్దులను దాటింది. 2024లో సెన్సార్ పూర్తి చేసుకున్న చిత్రాలకు గాను ఇస్తున్న 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల వేడుక గుజరాత్‌లోని ఏక్తా నగర్ (కెవాడియా)లో అత్యంత ఘనంగా జరగనుంది. భవిష్యత్‌లో కూడా ఈ సినీ పండగను దేశంలోని వివిధ నగరాలకు తీసుకెళ్లాలనే సరికొత్త ప్రణాళికతో అడుగులు పడుతున్నాయి. సెప్టెంబర్ 22న అంగరంగా వైభవంగా ఈ అవార్డుల ప్రధానోత్సం రాష్ట్రపతి చేతుల మీదుగా జరగనుంది, ఈ ఏడాది జాతీయ పురస్కారాలలో కథల వైవిధ్యం మరోసారి తన సత్తా చాటింది. ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ గా జాతీయ భావాన్ని ఉద్వేగభరితంగా ఆవిష్కరించిన ‘ఆర్టికల్ 370’ ఉత్తమ చిత్రంగా నిలిచింది. ఉత్తమ దర్శకత్వం అత్యుత్తమ మేకింగ్‌తో ఆకట్టుకున్న ‘అమరన్’ చిత్రానికి దక్కింది. నాన్-ఫీచర్ ఫిల్మ్ విభాగంలో ‘అంగెన్’ చిత్రం అవార్డు సాధించి, జాతీయ పురస్కారం అందుకున్న తొలి సంతాలీ చిత్రంగా చరిత్ర పుటలకెక్కింది. సినిమా ఒక నగరానికో, ఒక భాషకో పరిమితం కాదని.. కథ చెప్పే ప్రతి కళాకారుడికి, దాన్ని ఆస్వాదించే ప్రతి ప్రేక్షకుడికి ఈ వేదిక నిదర్శనమని 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు మరోసారి చాటిచెబుతున్నాయి